నవతెలంగాణ - హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలోని జరుగుతున్న అక్రమాలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ట్విట్టర్ వేదిగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగం కంటే, ప్రజల ఓటు హక్కు కంటే ఏ వ్యక్తీ లేదా సంస్థ పెద్దది కాదని ఆయన స్పష్టం చేశారు.
’భారత రాజ్యాంగం కంటే ఏదీ గొప్పది కాదు. ఏ భారతీయ పౌరుడిని కూడా వారి ఓటు హక్కును కోల్పోయేలా చేయడానికి వీలు లేదు. జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే!’ అంటూ కేటీఆర్ తన పోస్టులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క వ్యక్తినీ కాపాడుకోవడానికి ఎందుకు ఇంత ఆరాటం? అని ప్రశ్నించారు. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఏ ఒక్క వ్యక్తి గొప్పవారు కాదని స్పష్టం చేశారు. దేశం ఎంతోమంది వ్యక్తులను చూసింది, ఎంతో మంది వచ్చారు, వెళ్లారు.. కానీ ఈ దేశం ఎప్పుడూ బలంగా నిలబడిందని పేర్కొన్నారు. దేశ ఆత్మను దెబ్బతీసేలా ప్రత్యామ్నాయ వ్యవస్థలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఎవరికైనా సమయం ముగిసింది’ అని హెచ్చరించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్రమైన అక్రమాలపై సుప్రీంకోర్టు వెంటనే సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)