హుక్కా సెంటర్‌పై టాస్క్‌ఫోర్సు పోలీసుల దాడి

– 9 మంది యజమానులతోపాటు పలువురి అరెస్టు
– రూ.లక్ష విలువ చేసే వస్తువులు, రసాయనాల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిల్లో కొనసాగుతున్న హుక్కా సెంటర్‌పై టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడి చేశారు. 9 మంది నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు 15 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష విలువ చేసే వస్తువులు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం టాస్క్‌ ఫోర్సు డీసీపీ వైవీఎస్‌ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకీకి చెందిన ఎండీ అబ్దుల్‌ లత్తీఫ్‌ ఖాన్‌, పార్శిగుట్టకు చెందిన ఏం.శ్యామ్‌ సుంధర్‌, రైన్‌ బజార్‌కు చెందిన ఎండీ అష్వాక్‌, మెహిదీపట్నంకు చెందిన ఎండీ అస్లామ్‌ లు సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పంజాగుట్టలో ‘మియామీ గాలీ కేఫ్‌’ పేరుతో హుక్కా సెంటర్‌ను ఓపెన్‌ చేశారు. అందులో మఖ్తాకు చెందిన నంద కిషోర్‌ ధన్‌, మాల్య కుమార్‌ ధన్‌, దీపక్‌ సాహూ, మెహిదీపట్నంకు చెందిన అల్తాప్‌ రియాజ్‌, రాణీ ఖోస్‌ల ను హుక్కా సెంటర్‌లో పనిచేసేందుకు నియమించుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలతో హుక్కాను అందిస్తున్నారని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు.. నిర్వాహకులను అరెస్టు చేశారు. మరో 15 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు.

Spread the love