వ్యాధుల కాలం..తస్మాత్‌ జాగ్రత్త

– అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ చర్యలు
– ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా కసరత్తు
– గ్రామల్లో, పల్లెల్లో, తాండలాల్లో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దష్టి
– వారానికి రెండు రోజులు డ్రైడేగా పాటించేలా ప్రజల్లో అవగాహన
నవతెలంగాణ-దోమ
వర్షాకాలం వచ్చేసింది. దీంతో పాటు అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ప్రజలు రోగాల బారిన పడకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ముం దస్తు చర్యలు ప్రారంభించారు. అంటువ్యాధుల నివారణకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తమయ్యారు. జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే రోగులకు మందులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బోదకాలు, మలే రియా, డెంగ్యూ తదితర వ్యాధులకు సంబంధించిన వైద్యులు సర్కారు దవాఖానాల్లో అందుబాటులో ఉండాలని చెబుతూనే..వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తు న్నారు. పాము కాటు చికిత్సలకు కావాల్సిన మందులను జిల్లా వైద్యారోగ్యశాఖ సమకూర్చుకుంటోంది.
గ్రామాలు,తాండాలపై ప్రత్యేక దష్టి..
మారుమూల గ్రామాలు, తాండల ప్రజలకు వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించిన వైద్యాధికారులు అక్కడి ప్రజలకు మెరుగైన వైద్యమందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గుర్తించిన హైరిస్కు ప్రాంతాలతో బస్తీలు, గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. మలేరియా నిర్మూలనలో భాగంగా నివాసితులందరి రక్తనమూనాలు సేకరించారు. అధిక వర్షాల కారణంగా గర్భిణులు ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యుల సూచనల మేరకు గర్భిణులు ముందస్తుగా ఆస్పత్రుల్లో చేరాలని అధికారులు సూచిస్తున్నారు.
పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి
వర్షాకాలంలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. చిన్నపాటి వర్షాలకే వీధులు చెరువులను తలపిస్తాయి. మురుగునీరు, వ్యర్థాలు రోడ్లపైకి చేరటంతో వ్యాధులు సోకుతాయి. వానాకాలం ముగిసే వరకు గ్రామాలు, పల్లెలల్లో పారిశుధ్యం, మురుగునీటి నిర్వహణపై దష్టి సారించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
డ్రై డే..
వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటంతో దోమలు వద్ధి చెంది అనేక రోగాలకు కారణమవుతాయి. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వారంలో ఒకరోజు(శుక్రవారం) డ్రైడే పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటింటికీ పంచాయతీ కార్యదర్శి, ఆశా కార్యకర్త, అంగన్‌వాడీ టీచర్‌, పారి శుధ్య సిబ్బంది వెళ్లి నీటి నిల్వ వల్ల దోమలు ఏవిధంగా వద్ధి చెందుతాయనే అంశంపై అవగాహన కల్పిస్తారు.
జాగ్రత్తలు ఇవే…
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలి. నిల్వ పదార్థాలను తినరాదు. బయటి తినుబండరాలకు దూరంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగడం ఉత్తమం. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఓవర్హెడ్‌ ట్యాంకులు, నీటిసంపులు, నీటిపాత్రలపై నిరంతరం మూతలు ఉంచాలి. వారానికోసారి నీరు నిల్వ ఉన్న పాత్రలు, డ్రమ్ములను ఖాళీ చేసి శుభ్రపర్చాలి.

వ్యక్తిగత శుభ్రతతో రోగాలు దూరం..
వ్యక్తిగత శుభ్రతతో అంటూ రోగాలు వ్యాధులను దూరం చేయవచ్చు అని,సీజనల్‌ వ్యాధులు రాకుండా ప్రజలు ఎప్పటికప్పుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సీజన్‌ లో ఎక్కువగా వచ్చే వ్యాధులు మలే రియా, టైపాయిడ్‌, అతిసారా, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. రోగాల నుండి ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చ న్నారు. ఈ మూడు నెలల కాలం పాటు ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీరును తాగితే సగం రోగాలు దూరవుతాయన్నారు.
– రజిత, మండల వైద్యాధికారి

Spread the love