న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలో కార్లు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనం భారం పడనుంది. ఇప్పటికే దిగ్గజ సంస్థలు మారుతి సుజుకి, హ్యుందారు మోటార్, ఆడి, మహీంద్రా, ఎంజి మోటార్ కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా టాటా మోటార్స్, కియా ఇండియా మోటార్స్ ఆదే బాటులో నిర్ణయం తీసుకున్నాయి. జనవరి ఒక్కటో తేది నుంచి తమ తమ అన్ని రకాల కార్లపై 3 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సోమవారం వెల్లడించింది. విద్యుత్ కార్లపైనా పెంపు ఉంటుందని తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అదే విధంగా కియా కూడా కొత్త ఏడాది నుంచి తన కార్ల ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడిసరకు ధరలు పెరగడం, సరఫరా వ్యయాలు అధికమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.