– రూ.30 లక్షల కోట్లకు మార్కెట్ విలువ
న్యూఢిల్లీ : ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ రంగాల్లో రారాజుగా ఉన్న టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పాకిస్తాన్ జిడిపిని మించిపోయింది. గడిచిన ఏడాది కాలంలో టాటా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలు స్టాక్ మార్కెట్లో భారీగా రాబడిని ఆర్జించాయి. దాంతో టాటా గ్రూప్ ఉమ్మడి మార్కెట్ విలువ 365 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.30లక్షల కోట్లు)గా నమోదయ్యింది. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. పాక్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత, రుణ సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఒత్తిడిలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం.. పాక్ జిడిపి 341 బిలియన్ డాలర్లుగా ఉంది. టాటా గ్రూప్‌నకు చెందిన అన్ని లిస్టెడ్ కంపెనీల్లో ఒక్క టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ విలువనే 170 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు)గా ఉంది. టాటా గ్రూప్ కంపెనీలన్నీ మొత్తం గ్రూప్ మార్కెట్ విలువ పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. టాటా మోటార్స్ షేర్లు కేవలం ఏడాది సమయంలోనే 110శాతం పెరిగాయి. టాటా టెక్నాలజీస్, టిఆర్ఎఫ్, బెనారస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్సన్ ఇంజినీరింగ్ తదితర షేర్లు మంచి వృద్థిని నమోదు చేశాయి. టాటా గ్రూపులోని 25 కంపెనీలు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో ఉన్నాయి.