Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకవి క్లుప్తతకు అద్దం పడుతున్న
 తటిల్లత కవితలు

కవి క్లుప్తతకు అద్దం పడుతున్న
 తటిల్లత కవితలు

- Advertisement -

భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి
కె. ఆనందాచారి రచించిన ‘తటిల్లత’ కవితా సంపుటి ఆవిష్కరణ
నవతెలంగాణ–కల్చరల్‌

కె. ఆనందాచారి రచించిన ‘తటిల్లత’ కవితా సంపుటిలోని కవితలు కవి సూక్ష్మగ్రాహ్యతకు, క్లుప్తతకు అద్దం పడుతున్నాయని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. సందర్భానుసారంగా ఉదాహరించదగిన విధంగా కవితలు ఉన్నాయని తెలిపారు. సోమవారం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో కె. ఆనందాచారి రచించిన ‘తటిల్లత’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ హైదరాబాద్‌లోని ‌రవీంద్రభారతిలో నవతెలంగాణ పత్రిక సంపాదకులు ఆర్‌. రమేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ‘తటిల్లత’ కవితా సంపుటిని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దీర్ఘకవితల నుంచి పరిణామ క్రమంలో వచన కవిత్వం, అనంతరం మినీ కవితల కాలం వచ్చిందని తెలిపారు. మినీ కవితా ప్రక్రియకు అనేక పేర్లు పెట్టి తామే సృజనకారులమని ప్రచారం చేసుకునే రోజులు ఉన్నాయని అన్నారు. అయితే మినీ కవితా ప్రక్రియ స్థిరమైనదని తెలిపారు. ఆనందాచారి తాత్వికత, సామాజిక చింతనను మేళవించి మినీ కవితలు రాశారని, ప్రతి కవితలోనూ గొప్ప అనుభూతి కలుగుతుందని చెప్పారు.

ఆర్‌. రమేష్‌ మాట్లాడుతూ.. ఆనందాచారి నాలుగు దశాబ్దాల ఉపాధ్యాయ ఉద్యమంతోపాటు సాహితీ, సాంస్కృతిక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం నవతెలంగాణ ఫీచర్‌ ఎడిటర్‌గా పనిచేస్తూ సాహిత్య ప్రచారకునిగా, ఇతర రచయితలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ‘తటిల్లత’ అంటే మెరుపు అని, మెరుపు చైతన్యానికి ప్రతీక అని అన్నారు. దాని నిడివి తక్కువైనా శాశ్వత ముద్ర వేస్తుందని తెలిపారు. అభేద్యమైన ప్రపంచాన్ని మెరుపు చూపించినట్టే.. ఆనందాచారి రాసిన ప్రతి కవితా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి మాట్లాడుతూ.. కవితా వస్తువును బట్టి కవి ఆలోచనలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఆనందాచారి కవితలు ఆయన సామాజిక స్పృహకు నిదర్శనమని తెలిపారు. కవి కేవీ యాకూబ్‌ మాట్లాడుతూ.. రచన అవార్డులు, రివార్డుల కోసం కాకుండా సమాజం కోసం, సమాజంలోని మనుషుల మేలు కోసం సాగాలని అన్నారు. ఆనందాచారి మానవ హృదయాలపై ముద్ర వేసేలా కవితలు రాశారని చెప్పారు. డాక్టర్‌ రఘు మాట్లాడుతూ.. సమకాలీన జీవన సమస్యలను ఆనందాచారి తన కవితల్లో ఆవిష్కరించారని అన్నారు. ఈ కవితలకు ముగింపు లేదని తెలిపారు. రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ.. కవిత్వాన్ని కేవలం సామాజిక అంశాలకే పరిమితం చేయకుండా సమాజంలో ప్రేమ కూడా అవసరమనే విషయాన్ని ఆనందాచారి తన రచనల ద్వారా చాటారన్నారు. ప్రముఖ రచయిత కుప్పిలి పద్మ మాట్లాడుతూ.. జెన్‌-జీ ఉద్యమంలో ఆనందాచారి కవితలు నినాదాలుగా ఉపయోగపడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనందాచారి ‘తటిల్లత’ కవితా సంపుటిని తన భార్య సుమతికి అంకితం చేశారు. నవతెలంగాణ వెబ్‌ ఇన్‌‌చార్జి మోహనకృష్ణ స్వాగతం పలకగా, శరత్‌ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సలీమ, ఏ. నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -