బదిలీల్లో సాంకేతిక తప్పులను సరిదిద్దాలి

– పీఆర్టీయూ తెలంగాణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ బదిలీల్లో సాంకేతిక కారణాల ద్వారా జరిగిన తప్పులను సరిదిద్దాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ అబ్దుల్లా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు ఇచ్చిన ఆప్షన్లు కాకుండా ఇతర పాఠశాలలు బదిలీల్లో కేటాయించబడ్డాయని తెలిపారు. సీనియర్ల కన్నా జూనియర్లకే మంచి స్థానాలు కేటాయించారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని డీఎస్సీ దృష్టికి తీసుకొస్తే పొరపాటు జరిగిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారని తెలిపారు. కానీ ాటిని పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లామనీ, దరఖాస్తులను పరిశీలిస్తామన్నారని వివరించారు. రెండు రోజుల్లో సవరించిన ఉత్తర్వులను సంబంధిత డీఈవోలకు పంపిస్తామంటూ హామీ ఇచ్చారని తెలిపారు.

Spread the love