తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి: మురళీధర్ 

నవతెలంగాణ – పెద్దవంగర

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి, ఆదుకోవాలని ఉద్యమకారులు సుంకరి మురళీధర్, బోగోజు రత్నవిలాచారి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఎంపీపీ ఎర్ర సబిత వెంకన్న లు కలిసి ఉద్యమకారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు. ఎన్నో పోరాటాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఉద్యమకారుల ఆత్మగౌరవానికి, అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ జానీ, వీరారెడ్డి, మెట్టు నగేష్, యూత్ నాయకులు ఆవుల మహేష్, చిలుక సంపత్, అనపురం వినోద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love