తెలుగు నేల మీద జానపద విజ్ఞానం, జానపద వాజ్ఞ్మయం, ఈ రెంటి పరిశోధన అనగానే కళ్ళ ముందు మెదిలే సరస్వతీమూర్తి ఆచార్య బిరుదురాజు రామరాజు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో వరిష్ట ఆచార్యులు, ఎమిరిటస్ ప్రొఫెసర్, కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు, సంస్కృతాంద్రం, హిందీ, ఉర్దూ, పారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. తెలుగు, సంస్కృతాలతో పాటు ఆంగ్లంలోనూ రచనలు చేశారు. ఇంతటి మహా పండితులు బాలల కోసం రచనలు చేశారు. బాలల కోసం ‘బాలశిక్ష’లను రూపొందించారు. బాలల కోసం వందలాది జానపద గీతాలను సేకరించి వారసత్వ సంపదగా అందించారు.
16 ఏప్రిల్ 1925న వరంగల్ జిల్లా దేవునూరులో పుట్టారు. శ్రీమతి లక్ష్మీదేవమ్మ- బిరుదురాజు నారాయణరాజు వీరి తల్లితండ్రులు. విద్యార్థిగా ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నారు, మహాత్మాగాంధీతో కలిసి సత్యాగ్రహం చేశారు. కాళోజి, టి.హయగ్రీవాచారి, జమలాపురం కేశవరావు వంటి ఆనాటి యువకులతో కలిసి స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహంలో పాల్గొని మూడు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఆనాటి తెలంగాణా రచయితల సంఘానికి తొలి కార్యదర్శి రామరాజు. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులుగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనుమతి లేకుండా కవిసమ్మేళనం జరిపి అరెస్టయ్యారు.
రామరాజు రచనల్లో దాశరథి, సినారెతో పాటు ఇతరులతో తెచ్చిన ‘పూల పాటలు’లోని భావగీతాలు మొదలుకుని ‘తెలుగు వీరుడు’ సదాశివ రెడ్డి మొదలు, సత్యసాయిబాబా ప్రసంగాలు ‘నేను నేనే’ వరకు బాలల గురించి, విద్యార్థుల గురించి ఉన్నాయి. రామరాజు చక్కని బాల గేయాలు, కథలను రాశారు. సదాశివరెడ్డి కథ కూడా అందులో చేర్చారు. మరికొన్ని బాలల రచనలు ప్రస్తుతానికి అలభ్యాలు. రచయితగా ‘ఆంధ్ర యోగులు (నాలుగు సంపుటాలు), సంస్కృత సాహిత్యానికి తెలుగువారి సేవ, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు, తెలుగు వీరుడు, తెలుగు జానపద రామాయణం, వీర గాథలు, యక్షగాన వాజ్ఞ్మయం, తెలుగు సాహిత్యోద్ధారకులు, ఉర్దూ-తెలుగు నిఘంటువు, విన్నపాలు, పల్లెపట్టు నాటకంతో పాటు త్రివేణి’ ఆచార్య రామరాజు ప్రసిద్ధ రచనల్లో కొన్ని. జానపద వాజ్ఞ్మయం విషయంలో ఎంత గొప్ప కృషిచేశారో బాలల జానపద వాజ్ఞ్మయం విషయంలోనూ అంతే కృషిచేశారు. వీరు ప్రచురించిన ‘తెలంగాణ పిల్లల పాటలు’ చక్కని నిదర్శనం. ఇంకా ‘తెలంగాణ పల్లె పాటలు’, ‘జాజిరి పాటలు’ కూడా వీరి సేకరణలో ఉన్నాయి. వీరు అందుకున్న పురస్కారాలు అసంఖ్యాకం.
బాలల కోసం రామరాజు ‘తెలంగాణ పిల్లల పాటల’తో పాటు రెండు ‘బాలశిక్ష’ లను రచించారు. ‘గురుగోవిందు సింగు చరిత్ర’ కొద్డిగా పెద్ద పిల్లల కోసం తెచ్చారు. ‘తెలుగు వీరుడు-సదాశివ రెడ్డి’ కథ వంటివి యువతరం కోసం తెచ్చారు. ఆ రెండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలుగా వచ్చాయి. ఆచార్యులుగా విశ్వవిద్యాలయాల్లో పి.జి. విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆచార్య రామరాజు పిల్లల కోసం వాళ్ళ స్థాయికి చేరి, ఇంకా చెప్పాలంటే ఎదిగి రాయడం విశేషం. ఇందులో ఆయన కూర్చిన అంశాలన్నీ పిల్లల కోసం, పిల్లల స్థాయిలో కూర్చినవే కాకుండా వాళ్ళ మనసులో బలమైన ముద్రవేసేవిగా వున్నాయి. తన ముందుమాటలో ‘పిల్లల ఉచ్చారణ సరిగా ఉండడం కోసం, కంఠస్థం కావడం కోసం’ మాత్రమే కూర్చానని చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా బాలల మనస్తత్వ శాస్త్రవేత్తలు ‘అర్థాలు వివరించవలెనన్న నిర్భంధం లేదు’ అనడం ఆయనకు బాలల మనస్తత్వం పట్ల ఉన్న అవగాహనకు నిదర్శనం. వీరు కూర్చిన రెండు బాలశిక్షలు కూడా దానికి ప్రతిబింబాలుగానే కనిపిస్తాయి. ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ మొదలైన ఈ పుస్తకం ‘ఓం నమ: శివాయ సిద్ధం నమ:’ తొలి మలితరాలు కాన్గీర్ బడిలో చదువుకున్న జ్ఞాపకాలను తొంభయ్యవ దశకంలోని పిల్లలకు చెబుతారాయన. అంతేకాదు తెలుగు వర్ణమాలను ‘ఓనమాలు’ అని నడానికి ఈ ఓం నమ: శివాయ అని రాయడం వల్లనే ఆ పేరు వచ్చిందని కూడా చెబుతారు. పసిపిల్లల పుస్తకంలో ఆయన తన పాండిత్యాన్ని కాక పిల్లల పట్ల వాళ్ళ స్థాయి పట్ల ప్రేమను చూపడం ఈ రెండు పుస్తకాల్లో కనిపిస్తుంది. ఇక ఇందులోని అంశాల విషయానికి వస్తే సంప్రదాయంగా వస్తున్నవే అయినప్పటికీ అంకెలు, నెలలు, వారాలు వంటివి చూడవచ్చు. ప్రాస వాక్యాల కోసం ‘ప్రాస వాక్యములు’ పేర రాసిన ‘దేవదేవరమ్ము – కావుమయ్య మమ్ము/ గట్టి మాట నుడువ – గర్వమంత విడువు/ దుడుకుమాని నడువు – దురుసుతనము విడువు/ చదువురాని మొద్దు – కదలలేని ఎద్దు/ నీతిలేని వాడు – కోతికంటె పాడు/ ప్రియము లేని విందు – నయముకాని మందు’ వంటివి రామరాజు ఏరి కూర్చడం ఆయనకు భాషపై వున్న పట్టుకు మాత్రమే నిదర్శనం కాదు, బాలల మనస్తత్వ స్థాయిపై వున్న ఒక చక్కని అవగాహనకు కూడా ఆనవాలు. వీరు సేకరించిన తెలంగాణ పిల్లల పాటలు ఒక అపారమైన సంపద. ‘ఊగూ ఊగూ గంగెద్దా/ ఉగ్గు పాలే గంగెద్దా/ సోలీ ఊగే గంగెద్దా/ సోలెడు పాలే గంగెద్దా’ వంటి పాటలు సేకరించి అందించింది వీరే. రెండవ బాలశిక్షను 1985లో కూర్చారు రామరాజు. ఇందులో పిల్లలకు ద్విపదలను అందించారు. ‘చిననాటి అలవాట్లు చిరకాలముండు/ కనుక మంచినే నేడు కలిగించుకొమ్ము’ వంటివి ఇందులో ఉన్నాయి. ఆచార్య రామరాజు కూర్చిన ఈ రెండు బాల శిక్షలు చదివే మన తల్లి తండ్రులు, అన్నలు, అక్కల తరం ఎదిగింది. ఆచార్య బిరుదురాజు రామరాజు అనే తెలంగాణ తేజోమూర్తి- తెలుగువారి వైభవదీప్తి ఈ నేల మీద కళ్ళు తెరిచి నూరేళ్ళు. ఆయన తెలుగు భాషా సాహిత్యాలకు, తెలంగాణ జానపద, బాల సారస్వతాలకు చేసిన సేవ వారసత్వం మరో వెయ్యేళ్ళు.
(16 ఏప్రిల్ 1925న శత జయంతి సందర్భంగా నివాళి )
– డా|| పత్తిపాక మోహన్
9966229548