తెలంగాణా జీవనాడి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

Telangana's lifeline Sri Ram Sagar Project‘శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు’ను తెలంగాణా ప్రాంతానికి జీవనాడిగా పరిగణిస్తారు. తెలంగాణాకు సాగునీటి లభ్యత ఈ ప్రాజెక్టు ద్వారానే లభిస్తోంది. గతంలో పోచంపాడు ప్రాజెక్టుగా పేర్కొన్న ప్రాజెక్టే ఈ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు. గోదావరి నదిపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాల్గొండ మండలంలో ఈ ప్రాజెక్టు ఉంది. గోదావరి నదిపై తెలంగాణాలో ఇది మొట్ట మొదటి ప్రాజెక్టు. 26, జూలై, 1963 న ఆనాటి భారత ప్రధాని ఈ ప్రాజెక్టుకు శంఖు స్థాపన చేశారు. 1977 నుంచి రైతులకు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది.
ఈ ప్రాజెక్టు రిజర్వాయర్‌ సామర్థ్యం 90 టి.ఎం.సి.లు కాగా 42 వరద గేట్లు ఉన్నాయి. రామగుండం లోని ఎన్‌.టీ.పీ.సి ధర్మల్‌ కేంద్రానికి ఈ ప్రాజెక్టు ద్వారానే నీటి లభ్యత జరుగుతోంది. 1983 తర్వాత నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి రామారావు హయాంలో ఈ ప్రాజెక్టు విస్తరణ జరిగి 36 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి మొదలయింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ఉమ్మడి 12 జిల్లాల్లో సుమారు 740 చ.కిమీ విస్తీర్ణంలో సాగునీరు అందుబాటులోకి ఉన్నా, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల రైతాంగానికి సాగునీటి అవసరాలు ఈ ప్రాజెక్టు ద్వారానే తీరుతున్నాయి.
ఈ ప్రాజెక్టు ఎత్తు 43 మీటర్లు కాగా, 15 కి.మీ. పొడవున విస్తరించి ఉంది. ఈ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు సందర్శకులకు మంచి కాలక్షేప విహార కేంద్రంగా, ఒక పర్యాటక కూడలిగా పేరు గాంచింది. నిర్మల్‌ కు 20 కి.మీ.దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు సందర్శనకు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు మంచి అనుకూలంగా చెప్పవచ్చు. ఆ సమయంలో వలస పక్షుల రాకతో ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు మరింతగా అందాన్ని పెంపొందింప చేసుకుంటాయి. ఒక్కసారయినా సందర్శించవలసిన ప్రాంతం ‘శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌’.
– పంతంగి శ్రీనివాస రావు
9182203351

Spread the love