నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లో ఉద్రిక్తత నెలకొంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్య మందిర్ లో రామ దర్శనకు వెళ్తుతున్న అజయ్ రాయ్ తో పాటు ఆయన అనుచరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు. తమను బలవంతంగా అయోధ్యకు వెళ్లకుండా అడ్డుకున్నారని, దారిలో తమను అడ్డగించి నిలువరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తనతో పాటు అనేక మందిని నిర్భందించారని మండిపడ్డారు.
“సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో, పోలీసులు మమ్మల్ని బలవంతంగా అరెస్టు చేసి ఆచార్య నరేంద్ర దేవ్ విశ్వవిద్యాలయ అతిథి గృహానికి తీసుకువచ్చారు. మమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్నారు, ఆలయాన్ని సందర్శించకుండా అడ్డుకుంటున్నారు… మేమంతా శ్రీరాముని ఆశీస్సులు పొందేందుకు అయోధ్యను సందర్శించాలని అనుకున్నాము. కానుకలు, విరాళాల చోరీ, భూ కుంభకోణాల ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ (RSS) , బీజేపీ (BJP) ఈ పవిత్ర స్థలానికి తెచ్చిన అపఖ్యాతి గురించి కూడా మేము దేవుడికి ప్రార్థన చేయాలనుకున్నాము… నన్ను, నా సహచరులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆలయాన్ని సందర్శించే తమ హక్కును వినియోగించుకోవడానికి జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని” ఆయన స్పష్టం చేశారు.
యోగి ప్రభుత్వ దౌర్జన్యాన్ని అజయ్ రాయ్ భార్య రీనా రాయ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం తన భర్త గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తోందని, రామజన్మభూమి ఆలయంలో “కానుకల చోరీ”కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.



