ఫిబ్రవరి 1 లోపు ముగియనున్న సర్పంచ్ ల పదవీ కాలం

– గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులు….
– ఫిబ్రవరి 2న బాధ్యతలు చేపట్టే అవకాశం…?
– ఎన్నికల నిర్వహణపై సర్కార్ వెనుకడుగు
– పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముందుకు..
– పదవీ కాలం పొడిగించాలి అంటున్న సర్పంచ్ లు..
-రిజర్వేషన్ లు పైనా కొరవడిన స్పష్టత..
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామ పంచాయితీలకు ఫిబ్రవరి 2 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించనుంది.ఫిబ్రవరి 1వ తేదీతో ప్రస్తుత పంచాయితీ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుండటంతో 2 వ తేదీ నుండి పంచాయితీ పాలన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగనుంది. సకాలంలో పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించటానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది.పార్లమెంట్ ఎన్నికలు తర్వాతనే గ్రామ పంచాయితీల ఎన్నికల నిర్వాహణకు ముందుకు వెళ్ళాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుంది.ఎన్నికల నిర్వహణకు కనీసం నెల రోజుల సమయం అవసరం ఉంటుంది. కానీ మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండటంతో ఇంకా ఎటువంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకపోవటం సందిగ్ధత నెలకొంది.స్థానిక రిజర్వేషన్ల పైనా స్పష్టత లేకపోవటంతో ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదన్నది అధికారుల వాదన.మరో ప్రక్క సర్పంచ్ లు తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నా ప్రత్యేక అధికారుల నియామకానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 451 గ్రామ పంచాయితీలు, 5,500 నుండి 6 వేల వరకు వార్డులు ఉన్నాయి
ప్రత్యేకాధికారుల నియామకం: జిల్లాలోని గ్రామ పంచాయితీలకు 2019 లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది.వీటిని ఎన్నికల సంఘం మూడు విడతల్లో పూర్తి చేసింది.ఎన్నికైన సర్పంచ్లు ఫిబ్రవరి 1 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. మరో రెండు రోజుల్లో వారి పదవీ కాలం ముగియనుంది. కొత్త పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలకు కనీసం నెల రోజులైనా సమయం కావాలి కానీ వరకు ఎన్నికల సంఘం ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేడు ఇటీవల వేములవాడ పర్యటనలో మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించ లేమని కూడా ప్రకటించారు.ఈ నెల మొదటి వారంలో ఓటర్ల జాబితాపై హడావుడి చేసిన అధికారులు తర్వాత మిన్నకుండిపోయారు. పార్లమెంట్ ఎన్నికల ముగిసే వరకు పంచాయితీ ఎన్నికలు నిర్వహించ కూడదని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ప్రత్యేక అధికారుల నియామకం కోసం అధికారులు జాబితాలను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు.ఎన్నికలు నిర్వహించ లేని పక్షంలో తన పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని సర్పంచ్లు కోరుతున్నారు.ప్రభుత్వం అంగీకరిస్తే ప్రస్తుత సర్పంచ్ లను పర్సన్ ఇన్చార్జి లు  కొనసాగించే అవకాశం ఉంది.కానీ సర్పంచ్ ల పదవీ కాలాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది అందుకే ఎన్నికలు నిర్వహించ లేక పోతున్నందున ప్రత్యేకాధికారులను నియమించాలని ఆలోచిస్తుంది..
2 వ తేదీన ప్రత్యేకాధికారుల బాధ్యతలు : గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించింది.తదనుగుణంగా అందుబాటులో ఉన్న అధికారుల జాబితాను జిల్లాల కలెక్టర్ల ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించింది.గ్రామ పంచాయితీల్లో ప్రస్తుత పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు తీసుకునే అధికారులకు మౌఖిక ఆదేశాలు సైతం అందినట్లు తెలిసింది.ఫిబ్రవరి 1వ తేదీన పదవీ కాలం ముగియనుండటంతో 2 వ తేదీన ప్రత్యేక అధికారులు భాధ్యతలు చేపట్టనున్నారు. మండలాల వారీగా ప్రత్యేకాధికారి వివరాలతో కూడిన జాబితాలను ఎంపీడీవో లు కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందించారు.ఈలోగానే గ్రామ పంచాయితీల ను సందర్శించి ప్రత్యేక బాధ్యతలు స్వీకరించటానికి అధికారులు సిద్దమవుతున్నారు.
పంచాయితీలకు ప్రత్యేక అధికారులు –  శ్రీనివాసరావు, ఎంపీడీవో, అశ్వారావుపేట
గ్రామ పంచాయితీల పదవీ కాలం ఫిబ్రవరి 1 తో ముగియనుండటంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవటంతో ప్రత్యేకాధికారులు నియామకం కోసం అధికారుల వివరాలతో కూడిన జాబితాను జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అంజేశాము.రెండు రోజుల్లో ప్రత్యేకాధికారుల నియామకం జరగనుంది.గ్రామ పంచాయితీల్లో రోజు వారీ పరిస్థితులను క్షేత్ర స్థాయిలో ప్రత్యేకాధికారులుగా నియమించబడే అధికారులు పరిశీలిస్తున్నారు.
Spread the love