- జిల్లాలో 23.6 శాతం వర్షపాత లోటు..
- 16 మండలాల్లో లోటు పరిస్థితి
నవతెలంగాణ – అశ్వారావుపేట
వానాకాలం ముగియడానికి మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి.నాలుగు నెలల వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి వర్షపాత లోటుతో సాగుతున్న జిల్లాలో తాజా వర్షాలతో భూమిలో తేమ పెరిగి పంటలకు ప్రయోజనం చేకూరే పరిస్థితి ఏర్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెప్టెంబర్ 24 నాటికి సాధారణ వర్షపాతం 950.3 మి.మీ. ఉండాల్సి ఉండగా,ఇప్పటివరకు 726.1 మి.మీ. మాత్రమే నమోదైంది.దీంతో 23.6 శాతం లోటు కొనసాగుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో 16 మండలాలు లోటులో, ఏడు మండలాలు సాధారణ వర్షపాతంలో ఉన్నాయి.
గురువారం ఉదయానికి జిల్లాలో సగటున 43.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేటలో అత్యధికంగా 78.4 మి.మీ.,
దమ్మపేటలో 77 మి.మీ., ములకలపల్లిలో 67 మి.మీ., జూలూరుపాడులో 67.8 మి.మీ. వర్షం కురిసింది.
జిల్లాలో నాలుగు మండలాల్లో మోస్తరు, 15 మండలాల్లో రేటర్ హెవీ, నాలుగు మండలాల్లో హెవీ వర్షపాతం నమోదైంది.
సెప్టెంబర్లో మాత్రం అధిక వర్షం:
సీజన్ మొత్తం లోటులో ఉన్నప్పటికీ సెప్టెంబర్లో ఇప్పటివరకు సాధారణం కంటే ఎక్కువ వర్షం నమోదైంది. సెప్టెంబర్ 24 నాటికి సాధారణ వర్షపాతం 173.4 మి.మీ. కాగా, 190.1 మి.మీ. నమోదైంది. అంటే 9.7 శాతం అధికం.
అశ్వారావుపేట నియోజకవర్గంలోనూ..
మండలం వర్షపాతం (మి.మీ లో)
అశ్వారావుపేట 78.4
దమ్మపేట 77.0
ములకలపల్లి 67.0
చండ్రుగొండ 58.0
అన్నపురెడ్డిపల్లి 32.4
ఇప్పటికే పంటలు కీలక దశలో ఉన్న నేపథ్యంలో కురుస్తున్న వర్షాలు నేలకు తేమను అందించడంతో పాటు పంటలకు అవసరమైన నీటి లభ్యతను పెంచుతున్నాయి. అయితే సీజన్ ముగింపునకు చేరుకున్నందున మిగిలిన రోజుల్లో నమోదయ్యే వర్షపాతమే లోటును ఎంతవరకు తగ్గిస్తుందనేది కీలకంగా మారింది. నేలకు తేమ అందితేనే పంటకు బలం.. వానాకాలం చివరి రోజుల్లో కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలకు కొంత ఊపిరినిస్తున్నాయి.



