విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్నే అందించాలి: అడిషనల్ కలెక్టర్

Students should be provided with quality meals: Additional Collectorనవతెలంగాణ – దుబ్బాక
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్నే అందించాలని.. నాసిరకం ఆహార పదార్థాలు అందిస్తే చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ హెచ్చరించారు.బుధవారం దుబ్బాక మండలం రామక్కపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని,దుబ్బాక మండల ప్రత్యేక అధికారిని తనుజ తో కలిసి అడిషనల్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ సందర్శించారు.డైనింగ్ హాల్,వంటశాల,వండిన ఆహార పదార్థాలు,కూరగాయల స్టోర్ రూమ్,డార్మెటరీ గదులను పరిశీలించారు.అన్నం మెత్తగా ఉండడంతో వెంటనే ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకొని మంచి బియ్యాన్ని పంపించాలని డీఎస్ఓ తనుజ కు సూచించారు.ఆహార పదార్థాలు రుచికరంగా లేవని,మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలని లేకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు.శ్రద్ధగా చదివి తల్లిదండ్రులు ,ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలని విద్యార్థినీలకు సూచించారు.అనంతరం అక్కడి డార్మెటరీ గదులను,బాత్రూంలను పరిశీలించారు.రక్తహీనత,చర్మవ్యాధుల బారిన పడ్డ విద్యార్థినిలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తూ మందులను అందించాలని ప్రిన్సిపాల్ శారద,రామక్కపేట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ అదీబా లకు సూచించారు.అలాగే రూ.కోటి వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కిచెన్ రూమ్ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామన్నారు.అంతకుముందు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఐఓసి కార్యాలయం వద్దనున్న ఓ ప్రైవేటు వెంచర్ ను ఆమె పరిశీలించారు.అడిషనల్ కలెక్టర్ వెంట ఎమ్మార్వో ఈ.సంజీవ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీవో వీ.భాస్కర శర్మ,మిషన్ భగీరథ ఏఈ నరేష్,ఆర్ఐ నరేందర్,పంచాయతీ కార్యదర్శులు, పలువురున్నారు.
Spread the love