దక్షిణాఫ్రికాలో మెజారిటీని కోల్పోయిన ఏఎన్‌సీ

– ముప్పై ఏండ్లల్లో తొలిసారిగా ఓటమి
జోహనెస్‌బర్గ్‌: ముప్పై ఏండ్లలో తొలిసారిగా దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికల్లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీి) మెజారిటీని సాధించలేకపోయింది. సంకీర్ణ చర్చలను తప్పనిసరి చేస్తూ ఏఎన్‌సీి కేవలం 40.2 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. వర్ణవివక్ష పాలన పతనం తర్వాత దేశంలో జరిగిన మొదటి ప్రజాస్వామ్య ఎన్నికల సమయంలో నెల్సన్‌ మండేలా 1994లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. జాతీయ అసెంబ్లీ, అలాగే ప్రాంతీయ పార్లమెంటు కు కొత్త సభ్యులను ఎన్నుకోవడానికి 28 మిలియన్ల మంది ఓటర్లు అర్హులు కావడంతో పోలింగ్‌ స్టేషన్‌లు బుధవారం తమ తలుపులు తెరిచాయి. గణనీయమైన సంఖ్యలో కొత్త పోటీదారులతో సహా 50కి పైగా పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. మొత్తం ఓటింగ్‌లో 99.9శాతం బ్యాలెట్‌ లెక్కింపు పూర్తి కావడంతో, ఏఎన్‌సీ 40.21శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతిపక్ష సెంట్రిస్ట్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ పార్టీ 21.76శాతం, వామపక్ష ఉమ్‌ ఖోంటో విసిజ్వే 14.59శాతం ఓట్లతో ఆ తర్వాత స్థానంలో ఉంది. ఏఎన్‌సీకి 2019లో వచ్చిన ఓట్లతో పోలిస్తే 17శాతం పాయింట్ల క్షీణత కనపడుతోంది. ఆదివారం సాయంత్రం తుది ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి తెలిపారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం, కొత్త పార్లమెంటు రెండు వారాల్లో సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి.
సంకీర్ణానికి సంబంధించిన సాధ్యత గురించి ఏఎన్‌సీ ”అందరితో మాట్లాడుతోంది” అని పార్టీ మొదటి డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌, నోమ్వులా మోకోన్యానే పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం ”తగిన సమయంలో” చర్చల కోసం రెడ్‌ లైన్లను సెట్‌ చేస్తుందని భావిస్తున్నారు. పార్టీ 45శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించడంలో విఫలమైతే ఏఎన్‌సీ నాయకుడు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా పదవీ విరమణ చేసే ఒత్తిడిని ఎదుర్కొంటాడని అనేక మీడియా సంస్థలు ఇటీవల పేర్కొన్నాయి. అయితే, ఏఎన్‌సీ ప్రతినిధులు ఆ పుకార్లను ఖండించారు. నిరంతర నేరాలు, పేదరికం, అధిక నిరుద్యోగిత రేటును ఉటంకిస్తూ ”అందరికీ మెరుగైన జీవితం” అనే వాగ్దానాన్ని నిలుపుకోవడంలో ఏఎన్‌సీ విఫలమైందని ప్రతిపక్షం విమర్శించింది.

Spread the love