ఈ ఉగాది
విశ్వంభరాన్ని ధరియించి విశ్వావసుగా వచ్చింది.
విశ్వైక ప్రేమతో తరియించి విశ్వమంతా నిలిచింది.
పాతదనంలో కొత్తదనం ఇంధనంలా మెరిసి
అందమైన మామిడి రెమ్మల మాటున బంధంలా పూత మురిసి
చెరుకు గడ హరివిల్లుగా మారి ద్వార తోరణమయ్యింది
పంచాంగ శ్రవణముల జాడ సాంప్రదాయాల తీరమయ్యింది
వేపపూల పరిమళాలతో
పులకరించింది నవ వసంతం
ఋతువుల క్రతువులతో
పలుకరించింది పండుగ అనునిత్యం
జీవనమాదూర్యపు అనుభూతుల తీపి
మట్టి పాత్రలో నిండిన పచ్చడి రుచి చూపి
దివ్య ఆమనుల ఉగాది వేళ
భవ్య ఆనందాల అనుభవాల హేల
నాలుగు కాలాలు సౌహార్డానికి చెలిమిగా
రంగుల ముంగిళ్ళు
సౌభాగ్యానికి కలిమిగా
అలౌకిక పరిష్వంగంలో నిత్యానందమై,
ఆంతరంగిక భావాల సంరంభంలో పరవశపు డెందమై,
మనో వాకిళ్ళ, తలపు తలుపులను తడుముతుంది,
కొత్తదనపు ఊట మరో అధ్యాయపు
వూహలను తరుముతుంది
ప్రతి చోటా ఈ ఉగాది విశ్వావసుగా
ఆకారం ధరించింది
ఉషస్సు నిండిన జగతిని
శతమానం భవతిగా దీవించింది
– డా.సముద్రాల శ్రీదేవి, 9949837743