ప్రభుత్వ విద్యాసంస్థల మూత ప్రభుత్వ వైఫల్యమే..

The closure of government educational institutions is a failure of the government.– ప్రపంచంలో ఏ దేశమూ విద్యను వ్యాపారమయం చేయలేదు
– కాలానికనుగుణంగా పాఠశాలలను మార్చాలి : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-కోదాడ రూరల్‌
ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడుతున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పబ్లిక్‌ క్లబ్‌ ఆవరణలో తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో శనివారం ‘ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువుల్లో అంతరాలు పోవాలి’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకవర్గాల విధానాలతోనే ప్రయివేట్‌ విద్యారంగం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా కొనసాగుతోందని, ఆర్థిక అంతరాలు పోవాలంటే ప్రభుత్వ బడులు నిలబడాలని అన్నారు. పదేండ్లలో ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేండ్లుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్కావెంజర్ల నియామకం చేయకపోవడం అత్యంత దారుణమన్నారు. జిల్లా కలెక్టరేట్‌, సెక్రటేరియట్‌లో కూడా ఊడిచే వారు, తాళం వేసేవారు లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పాఠశాలల్లో స్కావెంజర్‌ లేక ఉపాధ్యాయులే శుభ్రం చేస్తున్నారని, ప్రధానోపాధ్యాయులే తాళం తీయడం.. వేయడం పనులు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్కావెంజర్ల నియామకం చేయాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను మార్చాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగంపై తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ఉందని తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలన్నారు.ప్రపంచంలో భారతదేశం తప్ప ఏ దేశం విద్యారంగాన్ని వ్యాపారమయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య అత్యంత వ్యాపారమయంగా మారిందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడకపోతే ప్రభుత్వ బడి లేని రాష్ట్రంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యాసంస్థల పరిరక్షణకు ”విద్యా, వైద్యం ప్రభుత్వ బాధ్యత” అనే నినాదంతో తెలంగాణ పౌర స్పందన వేదిక అందర్నీ భాగస్వాముల్ని చేసి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కెఏ.మంగా, జిల్లా అధ్యక్షులు ఆర్‌.ధనమూర్తి, కోదాడ ప్రాంతీయ అధ్యక్షులు వెంకటరమణ, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్‌రెడ్డి, టి ఏపీఆర్పీఏ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డంవెంకట్‌రెడ్డి, యూటీఎఫ్‌ బాధ్యులు పాల్గొన్నారు.

Spread the love