కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది

– ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తాం
– రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఆకాశంపై ఉమ్మివేసినట్టు
– జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 ఆరు గ్యారెంటీలను  అమలు చేస్తుందని, ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల పైన చిత్తశుద్ధితో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలకు ఎన్నికల కోడ్ వల్ల కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయన్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నెలల్లోనే ఆరు గ్యారంటీలో నాలుగు గ్యారంటిలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందన్నారు.అందులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచడం ,500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందించడం లాంటి నాలుగు గ్యారంటీలను అమలు చేసిందని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని బిజెపి, బిఆర్ఎస్ నాయకులు గమనించాలని ఆయన సూచించారు. అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్ లో తెలిపిన విధంగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ పథకాన్ని కూడా ఆగస్టు 15వ తేదీ వరకు అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తెలపడం జరిగిందన్నారు.
అందులో భాగంగానే జులై 1 నుండి ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేయడానికి పూర్తి  ప్రణాళిక అధికార యంత్రాంగం తయారు చేస్తుందని మానాల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేయలేదని బిఆర్ఎస్ నాయకులు గ్రామ సింహాలుగా అరుస్తున్నారని విమర్శించారు.10 సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి, గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడడం చూస్తుంటే బిజెపి బిఆర్ఎస్ నాయకులను గ్రామ సింహాలతో పోల్చడం సరైనదేనని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పేద కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ఇస్తామని,సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాన ఎజెండాగా హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత కనీసం వాటి అమలుకు ప్రణాళిక కూడా చేయలేదని విమర్శించారు.రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, ఇంటికొక ఉద్యోగమని చెప్పి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడుతున్నారని దీనిని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాల్లో  బిఆర్ఎస్, బిజెపి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారని, టిఆర్ఎస్ బిజెపి ఒకటేనని బయటపడిందన్నారు. అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే దీక్షకు కూర్చుంటానని మాట్లాడుతున్నాడని కానీ రాకేష్ రెడ్డి ముందు వెళ్లి కేంద్రంలో ఉన్న మోడీతో మాట్లాడాలని సూచించారు. దేశ సంపద అందరికీ సంబంధించింది కానీ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది కాదని తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నిధులను ఇవ్వాల్సిందిగా రాకేష్ రెడ్డి మోడీతో మాట్లాడాలని మానాల మోహన్ రెడ్డి సూచించారు.రాకేష్ రెడ్డి తన స్థాయిని మరిచి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నాడని వ్యక్తిగత ఎజెండాతో ఆర్మూర్ నియోజకవర్గంలో పనిచేస్తానని ఎన్నికల్లో ఆర్మూర్ ప్రజలకు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన రాకేష్ రెడ్డి ఆరు నెలలు గడుస్తున్న ఎందుకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయడం లేదని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఆకాశం లాంటివారని రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఆకాశం పై ఉమ్మివేసినట్టు అని అది నీపైనే పడుతుందని మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని రాకేష్ రెడ్డికి మానాల మోహన్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, రాష్ట్రంలో రైతు రాజ్యం తీసుకువస్తామని ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో  మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డీ శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొనగిరి భాస్కర్, టౌన్ అధ్యక్షులు నిమ్మ రాజేంద్ర ప్రసాద్, కో ఆప్షన్ మెంబర్ పాషా, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ చిన్నోళ్ల  రెడ్డి, ప్రదీప్, వేములవాడ జగదీష్, రంజిత్, శైలెందర్, రవి, రాజు, ప్రతాప్, సుంకరి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love