ఆగని ట్రంప్‌ టారిఫ్‌ల విధ్వంసం

ఆగని ట్రంప్‌ టారిఫ్‌ల విధ్వంసం– నాపై 245 శాతానికి సుంకాల పెంపు
– బ్లాక్‌మెయిల్‌కు లొంగేది లేదన్న బీజింగ్‌
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై టారిఫ్‌ల విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా చైనా నుంచి చేసుకునే దిగుమతులపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచారు. దీంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరినట్టయ్యింది. చైనా తగ్గనంత వరకు తన తీరులో మార్పు ఉండబోదని యూఎస్‌ పేర్కొంది. తొలుత చైనాపై 10 శాతం సుంకాలు అమల్లో ఉండగా.. ఇటీవల క్రమంగా పెంచుతూ 145 శాతానికి చేర్చారు. తాజాగా సుంకాలను మరో 100 శాతం పెంచడం తీవ్ర ఆందోళనకరం.
ట్రంప్‌ ఎంత సుంకాలు విధించినా తాము భయపడే ప్రసక్తే లేదని చైనా తెగేసి చెప్పింది. మరోవైపు సమస్య పరిష్కారానికి తమ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆ దేశం పేర్కొంది. అమెరికాతో వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు తాము చర్చలకు సిద్ధమేనని మరోమారు స్పష్టం చేసింది. అమెరికా ఈ సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటే తమపై ఒత్తిడిని తీవ్రతరం చేయవద్దని సూచించింది. ”యూఎస్‌ ముందు భయ పెట్టడం, బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఆపాలి. పరస్పర ప్రయో జనాలు, సమానత్వం, గౌరవప్రదంగా ఉండేలా చర్చలు జరగాలి. వాణిజ్య యుద్ధాన్ని అమెరికానే ప్రారంభించింది.” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ అన్నారు.
ట్రంప్‌ ప్రారంభించిన టారిఫ్‌ యుద్ధం ఇటీవల ఇరు దేశాల మధ్య తీవ్ర ప్రతీకార చర్యలకు దారి తీస్తోన్న విషయం తెలిసిందే. బోయింగ్‌ విమానాల కొనుగోలును చైనా నిలిపివేయగా, చైనాకు ఎగుమతి చేసే హెచ్‌20 ఎఐ చిప్స్‌పై యూఎస్‌ ఆంక్షలు విధించింది. ట్రంప్‌ నిర్ణయంతో ఆ దేశ చిప్‌ కంపెనీల షేర్లు కుదేలు అవుతున్నాయి. చైనాకు ఎగుమతి చేసే చిప్స్‌ను నిలిపివేస్తే తమకు 5.5 డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఎన్విడియా ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్‌ చర్యలతో ఎన్విడియా షేర్లు కుదేలు అవుతోన్నాయి. మరోవైపు అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలకు కొద్ది రోజులు మినహాయింపు ఇవ్వనున్నట్టు ట్రంప్‌ తెలిపారు. సరఫరా గొలుసును సరి చేసుకోవడానికి కార్ల తయారీ కంపెనీలకు కొంత సమయం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
చైనా జీడీపీ ఉరకలు..
చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరుగులు పెడుతోంది. ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ 5.4 శాతం పెరిగింది. నిపుణులు ముందుగా 5.1 శాతం వృద్ధి అంచనా వేయగా.. అంతకు మించి రాణించడం విశేషం. గతేడాది తొలి త్రైమాసికంలోనూ 5.4 శాతం వృద్ధి చోటు చేసుకున్నప్పటికీ.. ఇటీవలి అమెరికా టారిఫ్‌ పరిణామాలు, ట్రంప్‌ విధానాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేశారు. మార్చిలో రిటైల్‌ అమ్మకాలు, వినిమయం 5.9 శాతం పెరిగింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి 7.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

Spread the love