డాక్టర్ల చర్చలు సఫలం ..

– ఆర్ఎంఓ తో కలిసి తనిఖీకి ఓకే 
– మెరుగైన వైద్య సేవలు అందించాలనే నిర్ణయం 
– డాక్టర్స్ అసోసియేషన్  బృందం వెల్లడి
– నేటి నుండి యధావిధిగా జిల్లా అధికారుల తనిఖీ : అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆస్పత్రి ని  జిల్లా అధికారులతో తనిఖీ చేయించే విషయంలో గత రెండు రోజులుగా మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ప్రొఫెసర్లు, విభాగాల అధిపతులు  చేస్తున్న నిరసనను విరమించుకున్నారు. ఈ విషయమై శుక్రవారం నలుగురు సభ్యులతో కూడిన  నల్గొండ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్  బృందం  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర  ను అదనపు కలెక్టర్  ఛాంబర్ లో కలిసి చర్చలు  జరిపారు. చర్చల అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర మాట్లాడుతూ.. తనతో డాక్టర్ల బృందం జరిపిన  చర్చలు ఫలవంతమయ్యాయని తెలిపారు. చర్చల వివరాలను ఆయన వెల్లడిస్తూ శుక్రవారం  నల్గొండ  వైద్య కళాశాల నుండి ఇద్దరు, తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ కి చెందిన ఖమ్మం, సూర్యాపేట వైద్య కళాశాలల నుండి వచ్చిన  ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల బృందం  తన దగ్గరికి వచ్చిందని, నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని అధికారులతో తనిఖీ చేయించే విషయం తనతో చర్చించడం జరిగిందని, చర్చల సందర్భంగా జిల్లా అధికారులతో ప్రధానాస్పత్రి ని ఆసుపత్రి పర్యవేక్షకులు ఏర్పాటు చేసిన ఒక ఆర్ ఎం ఓ తో కలిపి తనిఖీ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు ఒప్పుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
జిల్లా ప్రజలకు మెరుగైన  వైద్య సేవలు అందించు  విషయములో అందరు కలిసి పని చెయ్యాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.వైద్య బృందంతో జరిపిన చర్చల ప్రకారం  నల్గొండ జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంపిక చేసిన ఆర్ఎంవో తో కలిసి రేపటినుండి జిల్లా అధిలారులు యధావిధిగా నల్గొండ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రజలకు అవసరమైన పరిపాలనపరమైన  విభాగాలను తనిఖీ  చేస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో చర్చలు జరిపిన వారిలో నల్గొండ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జె. శ్రీకాంత్ వర్మ, ఎల్ రమేష్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, జోనల్ కార్యదర్శి, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గిరిధర్ నాయక్,  జి.జి. హెచ్ పర్యవేక్షకులు ప్రొఫెసర్ నిత్యానంద్ లు ఉన్నారు.
Spread the love