దేశంలో ప్రజాస్వామిక విలువలను వమ్ము చేయడమే గాక రాజ్యాంగ వ్యవస్థల మూలస్పూర్తిని కూడా దెబ్బతీస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో నిరంకుశ చర్యలకు పాల్ప డింది. ఈ క్రమంలో బాహాటంగా బరితెగించి వ్యవహరిం చినవి కొన్నయితే, అచ్చంగా చట్టబద్దంగా, చట్టం కోసమే చేస్తున్నట్టు కనిపిస్తూ చాపకింద నీరులా అనుకున్న పని కానిచ్చిన అతి తెలివి వేషాలు అనేకం.ప్రధాన ఎన్నికల కమిషనర్,కమిషనర్ల నియామక ప్రక్రి యకు సంబంధించి పార్లమెంటులో ఇటీవల బిల్లు ఆమోదింపచేసుకోవడం ఈ రెండవ కోవ లోకి వస్తుంది.2023 ఆగష్టులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాల అమలు కోసం ఈ చట్టం చేసినట్టు ప్రభుత్వం చెప్పుకుంది. కానీ వాస్త వానికి అక్షరాలా ఆ తీర్పు ప్రభావం లేకుండా చేయడానికీ అందులోని కీలక అంశాలను తిరస్కరిస్తూ చేసిన శాసనం ఇది. 140 మంది ఎంపిల సస్పెన్షన్, దాన్ని కప్పిపుచ్చడం కోసం ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్‌ను అనుకరించారనే గగ్గోలు నేపథ్యంలో కీల కమైన ఈ శాసనం మరుగున పడిపోయింది. వాస్తవానికి అది భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు గొడ్డలి పెట్టులాం టిది. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల ప్రక్రియకు ఆధ్వర్యం వహించే ఎన్నికల కమిషన్ నియామకం ప్రధాని ఇష్టారీతికి వదిలేసే దుర్మార్గమది. ఇదంతా సుప్రీంకోర్టు చెప్పినట్టు చెప్పడం మరింత విపరీతం. చీఫ్ ఎలక్షన్ కమిష నర్, ఇతర ఎన్నికల కమిషనర్లు(నియామక షరతులు, సర్వీ సు పదవీ నిబంధనలు) బిల్లు2023 పేరిట వచ్చిన ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 12న ఆమోదించింది. ప్రధా నమంత్రి అధ్యక్షులుగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నియమించే మరో కేంద్రమంత్రి సభ్యులుగా కమిటీ ఈ ఎంపిక కోసం రాష్ట్రపతికి పేరు సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే కార్యదర్శులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారే ఈ పదవికి అర్హులుగా వుంటారు. అంటే నియమించే కమిటీలో ప్రధాని మాట అమలవుతుంది. నియామకానికి అర్హులైన వారు కూడా ఆ ప్రభుత్వంలో పనిచేసిన వారే అయి వుండాలి. ఇక ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గురించి చెప్పేదేముంది?(ఒకసారి సిఇసిగా పనిచేశాక మరో పదవి చేపట్టరాదని మాత్రం ఇందులో వుంది.) ఈ బిల్లు సభ ముందుకు రావడానికి ముందు జరిగిన తతంగం మరింత కీలకమైంది.
రాజ్యాంగం, రాజకీయానుభవాలు
రాజ్యాంగం 324వ అధికరణం ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి నియమిస్తారని మాత్రమే పేర్కొంది.అయితే ఎన్ని కలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతి యుతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం అన్నపదానికి అర్థ ముంటుంది. దీర్ఘకాలంపాలన చేసిన కాంగ్రెస్ హయాం లోనే ఎన్నికల కమిషన్ల తీరు విమర్శలకు గురైంది. ఇందిరా గాంధీ హయాంలో ఎన్నికల, ఉప ఎన్నికల నిర్వహణ వా యిదా, కేంద్రబలగాల వినియోగం వంటివి విమర్శల పాలై నాయి. 1972లో పశ్చిమబెంగాల్‌లో సీపీఐ(ఎం), వామప క్షాలను అధికారంలోకి రాకుండా చేయడానికి సైన్యాన్ని దింపి రిగ్గింగ్ చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. చాలాసార్లు శాసనసభలను ముందే రద్దుచేయడం కూడా విమర్శల పాలైంది. ధనబలం ఫిరాయింపులు వంటి అనైతికత తాండవించడం మొదలైంది. కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన హెచ్‌ఎన్ బహుగుణ, విపిసింగ్ వంటి వారు ఉప ఎన్నికలు కోరితే వాటిని వాయిదా వేస్తూ రద్దు చేస్తూ ఇష్టానుసారం వ్యవహరించడం కూడా దేశం చూ సింది. అప్పట్లో ఒకే ఎన్నికల కమిషనర్ వుండే వారు. అద్వానీ రథయాత్ర తర్వాత, విపిసింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన అనంతరం కీలు బొమ్మ చంద్రశేఖర్ సర్కారు వచ్చింది. ఆ సమ యంలో ఎన్నికల కమిషనర్‌గా విఎన్ రమాదేవికి అర్హతలున్నా కాదని టిఎన్‌శేషన్‌ను చేశారు. ఎన్నికల కమిషన్ అధికారాలను మొద టిసారి గట్టిగా ఉపయోగించిన శేషన్‌ను ఆద ర్శంగా చెబుతుంటారు. కొన్ని విషయాల్లో అయన పాలక పార్టీలను అదుపు చేసిన మాట నిజమే గాని తనే ఒక నిరంకుశ కేంద్రంగా మారిపోయారు. మత రాజకీయాలను ఎన్నడూ పట్టించుకోలేదు. పార్టీల ప్రభుత్వాల రాజ్యాంగ బద్దమైన హక్కులను కూడా భంగ పరిచారు. ఆ సమయంలో తనను తొలగించే అవకాశం లేదు గనక మరో ఇద్దరు అదనపు కమిషనర్లను నియ మించడం ద్వారా అదుపు చేయాల్సివచ్చింది.
సిఇసిపై సుప్రీం కీలక తీర్పు
తర్వాతి కాలంలో వివిధ ప్రభుత్వాల హయాంలో ఈ తీరు మారిందని కాదు గానీ మోడీ హయాంలో మిగిలిన రంగాలలో వలెనే ఇక్కడా ఏకపక్ష ధోరణి ముదిరిపోయింది. సిబఐ ఇడి, సివిసి వంటి పదవుల నియామకంలో ఆశ్రితు లను నియమించి ప్రతిపక్షాలపై ప్రయోగించే ధోరణి పరా కాష్టకు చేరింది. దీనిపై అనేక సార్లు సంబంధిత వ్యక్తులు సంస్థలూ కూడా సుప్రీం కోర్టులో సవాలు చేయడం చూశాం. ఎక్కువ సందర్భంలో నచ్చినవారిని అడ్డదోవలో అందలమెక్కించడం మాత్రం ఆగలేదు. పలుసార్లు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని అక్షింతలు వేసినా ఆగ్రహించినా ధోరణి మారింది లేదు. నచ్చిన వాళ్లను నియమించడం వారికి పదేపదే పదవీకాలం పొడగించడం పరిపాటి అ యింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విషయంలో ముందే వద్ద న్నా వినకుండా నియమించడమే గాక రెండుసార్లు పొడ గింపు తీసుకున్నారు. చివరకు ఇదే ఆఖరిసారని హెచ్చ రించింది కోర్టు. ఇక మరింత కీలకమైన ఎన్నికల సంఘం విషయంలోనూ ఇదే సమస్య ఎదురైంది. ఏకపక్ష నియా మకాలు జరగకుండా ఒక నియామక ప్రక్రియ నిర్దేశిం చాలని కోరుతూ ఎడిఆర్(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) తరపున 2022లో ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుండగానే సిఇసి పదవీ విరమణ వచ్చింది. ఆ సమయంలోనే అరుణ్‌గోయెల్ అనే కార్యదర్శి తన పదవినుంచి స్వచ్చంద పదవీ విరమణ చేయడం, 24 గంటల్లోనే సిఇసిగా నియమించడం జరిగి పోయాయి. సుప్రీంకోర్టు ఒకవైపున ఈ విషయం విచారి స్తుండగానే ఇంత హడావుడి దేనికని తీవ్ర విమర్శలు వచ్చా యి. సిఇసి పదవీ కాలం ఆరేళ్లు, లేదా 65 ఏండ్లు నిండడం. ఇందులో ఏ కొలబద్దతో చూసినా గోయెల్ ఎంపికయ్యే అవ కాశముండదు.తమముందుకు వచ్చిన నాలుగు పేర్లలోనూ గోయెల్ చిన్నవారుగనక తనను నియమించినట్టు అడ్వకేట్ జనరల్ సమర్థించుకున్నారు.ఈ నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైనప్పుడు కేంద్రం అధికారాన్ని ప్రశ్నిం చలేమని కోర్టు చెప్పింది. అయితే ఎడిఆర్ కేసులో దీనిపై సమగ్ర తీర్పు వస్తుందని కూడా సూచించింది.తీరా ఆ కేసు విచారణకు వచ్చినపుడు ఎజి ఆర్ వెంకట్రామన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకపక్షంగా సమర్థించారు. రాజ్యాంగం సిఇసి నియామకంపై ఎలాటి నిర్దేశకాలు చేయలేదని వాదించారు. ఏమీ చెప్పనప్పుడు మరింత జాగ్రత్తగా వుండాలని ,దీనిపై ఏవైనా మార్గదర్శకాలు ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పగా అలా జోక్యం చేసుకోవాలని న్యాయవ్యవస్థకు అధికారం ఇవ్వ లేదని కూడా ఆయన అభ్యంతరం చెప్పారు.రాజ్యాంగం ఈ విషయంలో మౌనం పాటించింది గనక కోర్టులు చేయ డానికి లేదన్నారు. జస్టిస్ జోసఫ్ అధ్యక్షతన గల ధర్మాసనం దీనిపై తీర్పునిస్తూ సిఇసి నియామకంలో అనుసరించాల్సిన సూత్రాలపై పార్లమెంటు చట్టం చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తి రాజ్యాంగం సిఇసికి ఎంత ప్రత్యేక స్థానం ఇచ్చిందో అంబేద్కర్ మాట ల్లోనే ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు సక్రమంగా జరగడమనీ, దానికి ఎన్నికల సంఘం కీలక మని అంబేద్కర్ అప్పట్లో పేర్కొన్నారు. రాజ్యాంగపరిషత్తు చర్చలో ఈ నియామకంపై నిబంధనలు నిర్దిష్టంగా వుండా ల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ ప్రొఫెసర్ సిబ్బన్‌లాల్ సక్సేనా ప్రతిపాదించిన సమగ్ర సవరణ ఆ సందర్భంలో జరిగిన చర్చ వివరంగా పొందుపర్చారు. కాగ్ వంటివారితో పోలిస్తే ఎన్నికల సంఘం అత్యంత ముఖ్యం గనకే అందుకు ప్రత్యేక నియామక పద్ధతిని రాజ్యాంగం చెప్పిందనీ, ఇందుకు స్వతంత్రత అనేది కొలబద్ద అని స్పష్టం చేశారు. సిఇసి కార్యనిర్వాహక వర్గానికి లోబడి వుండకూడదనేది కీలకసూత్రం. పార్లమెంటు చట్టం చేసేలోగా కూడా స్వతం త్రత కాపాడేందుకు గాను ప్రధాని ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ రాష్ట్రపతి కి సూచలను చేయాలని నిర్దేశించారు.
తీర్పుకు తూట్లు పొడిచిన కేంద్రం
కోర్టు చెప్పినట్టే తాము కొత్తచట్టం తెచ్చామని కేంద్రం వాదించడం తీర్పును అపహాస్యం చేయడమే. ఎందుకంటే ఏ తీర్పులోనైనా రెండు భాగాలుంటాయి. ఒకటి ఒబిటర్ డిక్టా, రెండు రేషియో డిసిడెండి. మొదటిది ఆదేశపూర్వకం. తప్పక అమలు చేయాలి. రెండోది ఆ తీర్పునకు మూలమైన స్పూర్తి వివరణ. ఈ తీర్పులో కేంద్రం చట్టం చేయాలన్నది ఆదేశమైతే సిఇసి స్వతంత్రత కాపాడాలనేది స్పూర్తి. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తిని భాగస్వామిగా చేయడం ద్వారా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిం చింది. అయినా మోడీ సర్కారు ఏవో పొంతనలేని వాదనల తో బిల్లు తీసుకొచ్చింది. ప్రధాన న్యాయమూర్తిని భాగస్వా మిగా వుంచాలని కోర్టు సూచనగా చెబితే దాని బదులు ప్రధాని నియమించే కేంద్ర మంత్రికి సభ్యత్వం కల్పించింది. ప్రతిపక్ష నాయకుడికి నామక: స్థానం కల్పించినా మెజారిటీ వారికే వుంటుందనేని స్పష్టం. అంతేగాక కార్యదర్శి హోదా కలిగిన వారేనని చెప్పడం కూడా ఎంపికను పరిమితం చేసింది. ఇక ఎంపికయ్యేవారికి ప్రభుత్వం ఎలాటి ప్రత్యేకాభి మానం చూపినట్టు వుండకూడదని కూడా కోర్టుచెప్పింది. కాని ఇక్కడ కావలిసిన వారినే తీసుకోవడం ద్వారా వారు లోబడి వుండాల్సిన పరిస్థితి కల్పించబడింది. ప్రధాన కమి షనరుగా నియమించబడేవారికి సుప్రీం కోర్టు జడ్జిలతో సమానంగా జీతభత్యాలు వుండాలని తీర్పులో చెబితే ప్రభు త్వం మొదట కార్యదర్శి స్థాయి వేతనం మాత్రమే ప్రతిపా దించింది. ప్రతిపక్షాల విమర్శల తర్వాతనే దాన్ని ఆ స్థాయికి చేరుస్తూ సవరణ తెచ్చారు. సిజెఐ కూడా సభ్యుడుగా వుండాలని వచ్చిన సవరణను సభ తోసిపుచ్చింది.కమిషన్ సభ్యులకు విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు గాను కేసులు పెట్టే అవకాశం తొలగింపు అధికారం లేకుండా చేయాలన్న సూచనను కూడా ఆమోదించలేదు. ఒక్క సిఇసికి మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిల తరహాలో కేసుల నుంచి రక్షణ కల్పించబడింది. కోర్టుల జోక్యం కన్నా రాజ కీయ జోక్యమే ఎన్నికల సంఘానికి సవాలు గనక ఆ ఒత్తిడి ఆలాగే వుంటుందన్న మాట.ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి ఎన్నికల సంఘం బిల్లు తెచ్చారని ఎంపిలు విమర్శించగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్ ఆగ్రహించారు. సభలో మనం స్వతంత్రంగా నిర్ణ యాలు చేయాలి గాని ఎవరి పెత్తనం మనపై వుండరాదని సూక్తులు చెప్పారు.వాస్తవంగా జరిగింది వేరు. అన్ని విధాల కేంద్రానికి లోబడి వుండేలా ఎన్నికల కమిషనర్ల నియా మకానికి రంగం సిద్ధమైంది.ఇక ఎన్నికల స్వతంత్ర నిర్వహణ మరింత ప్రశ్నార్థకమవుతుంది.
తెలకపల్లి రవి