మండలంలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం..

– ఇష్టానుసారంగా జాబ్ కార్డులు జారీ, డిమాండ్లు సృష్టించడం
– నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ కార్డు జారి
– పని చేయకుండానే మస్టర్లు, బిల్లులు చెల్లింపులు 
– ఉపాధిహామీ కార్డులో షిఫ్టింగ్  లేదా చనిపోయారని డిలీట్ చేసిన వైనం 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కుల సంపాదనకు ఒక వరంలా మారింది. ఈ ఉపాధి హామీ పథకం పనులపై అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులను కొల్లగొడుతున్నారు. మండలంలోని ఓ గ్రామంలో ఓ కుంట వద్ద ఉపాధి కూలీలకు డిమాండ్ పెట్టగా పని చేయవలసిన ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో పని చేయించుటకు ఆ కార్యదర్శికే సాధ్యమయింది. కాగా, మైనర్ బాల బాలికల పేర్లు సైతం ఎక్కించిన ఘనత సంబంధిత అధికారులకే దక్కింది. మండలంలో పలు గ్రామపంచాయతీల ఉపాధి హామీ పథకం నిధులు గోల్ మాల్ చేస్తూ నిర్వీర్యం చేస్తున్న అధికారుల తీరు బట్టబయలు అయిన విషయంపై పూర్తి వివరాలు.. ఉపాధి హామీ పథకం వివరాల్లోకి వెళితే.. గ్రామపంచాయతీ కార్యదర్శి, టీఏలు, ఈజీఎస్ సిబ్బంది ఇష్టానుసారంగా జాబ్ కార్డులు, డిమాండ్లు సృష్టిస్తూ, పనిచేయకుండానే మస్టర్లు వేయడం పరిపాటిగా మారింది. దానికి గాను ఒక కుటుంబానికి సంబంధించి ఒక జాబ్ కార్డు ఉండాలి కానీ, అధికారులు తమకు అనుకూలంగా ఉన్న కొందరిని ఎంచుకొని కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ జాబ్ కార్డులు మంజూరు చేస్తూ, ఒక కుటుంబానికి 100 రోజుల పని కల్పించాల్సింది పోయి, ఒకే కుటుంబంలో ఒక్కొక్కరికి 100 రోజుల పని కల్పించే జాబ్ కార్డులు ఇవ్వడం గతంలో జరిగింది.
ప్రస్తుతం జరుగుతోంది. వంద రోజులు పూర్తయిన తరువాత మరో జాబ్ కార్డ్ కల్పిస్తూ, ఒకరి జాబ్ కార్డ్ పై మరొకరికి పని కల్పిస్తూ, మస్టర్లు వేస్తున్నట్లు కొంతమంది మేట్ల సహకారంతో చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. మండలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు కల్పిస్తున్న ఉపాధిని గండి కొడుతూ గ్రామపంచాయతీ, ఈజీఎస్ నిధులు కొందరు అక్రమార్కులు దారి మళ్లిస్తున్నట్టు సర్వత్రా విమర్శలున్నాయి. ఇష్టానుసారంగా పని దినాలు కల్పిస్తూ గ్రామంలో లేని వారిని, ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని వారిని సైతం పనిచేసినట్లు చూపిస్తూ, డబ్బులు లబ్ధిదారుని పేరుపై కాకుండా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తూ, దానికి వారికి 100 నుండి 500 వరకు చెల్లిస్తూ మిగిలిన మొత్తం కొంతమంది మేట్ల ద్వారా పంచాయితీ కార్యదర్శి, టిఏ, మేట్లకు లోపాయికారీ ఒప్పందంతో దండుకుంటున్నారని స్థానిక రాజకీయ నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందుకు మేట్ల కీలక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ఉన్న కుటుంబానికి అధికారులు మార్పులు, చేర్పులు చేస్తూ ఐదేళ్లలో ఐదు దఫాల జాబ్ కార్డులు జారీ చేసిన ఘనత సైతం మండల ఉపాధిలో ఉంది. ఈ విధంగా మండలంలో ఇష్టానుసారంగా వందల సంఖ్యలో జాబ్ కార్డులను జారీ చేసి ప్రతి ఏడాది సంవత్సరం పొడుగునా ప్రభుత్వానికి లక్షల రూపాయలు గండి పెడుతున్నారు. నిబంధనల ప్రకారం ఓ కూలీకి వంద రోజులు పని పూర్తయితే మరో ఏడాది పని కల్పించకూడదు అటువంటిది నా! అనుకుంటే చాలు ఎప్పుడైనా మండలంలో జాబ్ కార్డు ఇస్తారు. సాధారణ కుటుంబాలైతే ఒక కుటుంబంలోని నలుగురికి కలిపి ఒక జాబ్ కార్డు ఇవ్వడంతో ఒక్కొక్కరికి సంవత్సరానికి 25 రోజులు చొప్పున పని దినాలు వస్తాయి.
దీంతో మిగతా రోజులు కూలీలు పని లేక ఇబ్బంది పడుతున్నారు. కార్డులు తొలగించేందుకు స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ వారికి సహకరించకపోతే ఇష్టారాజ్యంగా కార్డులు తొలగించిన ఘటనలు మండలంలో చాలానే ఉన్నాయి. ఒక జాబ్ కార్డుపై వంద రోజులు పని పూర్తయితే! మరో కార్డు ఇచ్చేందుకు ఉన్న జాబ్ కార్డులో పేరు తప్పని, డుప్లికేట్ అని తొలగించిన వారి సంఖ్య చాంతాడంత ఉండగా, బతికి ఉన్నవాళ్లను సైతం మరణించినట్లు కూడా చూపిస్తు కార్డులను తొలగించినవి కోకొల్లలు. ప్రస్తుతం మండలంలో బతికున్న వాళ్లను జాబ్ కార్డులలో చంపేసిన ఘనత ఉపాధి హామీ అధికారులకే సాధ్యమయిందంటే అతిశయోక్తి కాదు. సుమారు 250 జాబ్ కార్డులు పై విధంగా తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు ఎంపిక చేసిన జాబ్ కార్డుదారులైతే వంద రోజులు పని పూర్తికాగానే ఆ జాబ్ కార్డు దారుని ఇంటిపేరు ముందుకు వెనుకకు మార్చి ఒకసారి, ఇంటి పేరు లేకుండా మరోసారి మార్చి అతనికే జాబ్ కార్డులు జారీ చేసి, మస్టర్లు వేసి పనులు చేయకుండానే ప్రభుత్వ లక్షల రూపాయలకు గండి పెడుతున్నారు. ఇదిలా ఉంటే పనిచేయని కూలీల డబ్బుల పంపకాల్లో సిబ్బందికి సహకరిస్తే పర్వాలేదు. లేదంటే కూలీల జాబ్ కార్డు ఊస్ట్ కావాల్సిందే. మండలంలోని ఓ గ్రామంలో ఒక కుటుంబానికి ఉపాధిహామీ పథకంలో డిమాండ్స్, మస్టర్, కూలీ డబ్బులు కూడా వచ్చాయి. ఇంకా కూలీలకు పని కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూలీలకు, అధికారుకు మధ్య సయోధ్య కుదరక కూలీల జాబ్ కార్డులు ఫేక్, డూప్లికేట్ వి అంటు పెద్ద అధికారి గుర్తించకుండానే మరో కిందిస్థాయి అధికారి పేర్లను తొలగించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈ నెల 28వ తేదీన జరిగే ఓపెన్ ఫోరం అనంతరం మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో 100 రోజుల ఉపాధి హామీ పథకం మండల, గ్రామ అధికారుల సర్వే ఏ మేరకు, ఎలా జరిగిందనే దానిపై నివ్వెరబోయే నవతెలంగాణ కథనం కోసం పాలకులు, జిల్లా కలెక్టర్, సామాన్య ప్రజానీకం అంత వరకూ వేచి చూడాల్సిందే..!
Spread the love