కళ్ల ముందు జరిగే సంఘటనలే తన కవిత్వం

తన కవిత్వంతన కళ్ల ముందు జరిగే సంఘటనల్ని.. కదిలించే సన్నివేశాల్ని.. కవితలుగా రాస్తూ నేటి తరంలో మేటి రచయితగా రాణిస్తున్నాడు ఈ యువకుడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూనే తను అక్షరాలను ఒద్దికగా రాస్తున్నాడు. తెలుగు భాషపై మంచి పట్టు, సాహిత్యంపై మక్కువతో భాషాభిమాని అనిపించుకున్నాడు. ఇప్పటికే రెండు కవితా సంపుటాలను వెలువరించి ప్రముఖల ప్రశంసలు అందుకుంటూ.. సాహిత్యలోకంలో తన బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నాడు ఈ మూడు పదుల యువకుడు. అతడే నాయిని గోవర్ధన్‌ రెడ్డి.
కలంతో కుస్తీ పడుతున్న గోవర్ధన్‌ ది మెదక్‌ జిల్లా శివంపేట మండలం కొత్తపేట్‌ గ్రామం. అమ్మ తారమ్మ, నాన్న జనార్ధన్‌ రెడ్డి. అక్క గీత తమ్ముడి ఆసక్తిని నిరంతరం ప్రోత్సహిస్తుంది. 2016లో కీర్తనతో వివాహమైంది. వీరి ఏకైక కుమార్తె ప్రణవి. గోవర్ధన్‌ ప్రతి విజయం వెనుక ఆమె అందించిన సహకారం ఎంతో గొప్పది. పాఠశాల స్థాయి నుండి వాలీబాల్‌ ఆటపై ఆసక్తితో అనేక మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బి.పి.ఇడి) కోర్సును పూర్తి చేసి 2012 డి.ఎస్సీ ద్వారా ప్రభుత్వ వ్యాయమ ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 2012 నుండి జెడ్‌ పీ హెచ్‌ ఎస్‌ ఏటిగడ్డ కిష్టాపూర్‌ మండలం, తొగుట, సిద్దిపేట జిల్లా నందు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఆ పాఠశాల నుండి అనేక మంది విద్యార్థులను, క్రీడాకారులుగా తయారు చేసి వివిధ క్రీడలలో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గోనేలా వారిని ప్రోత్సహించాడు.
సమాజమే కవిత్వం
సమాజంలో జరిగే సంఘటలు, వాటి వెనక విషయాలను పరిశీలించి.. రచయితగా మారినట్లు చెబుతాడు గోవర్ధన్‌. ‘For all good poetry is spontinous overflow of power feel-ings! – William words worth. కవిత్వమంటే ఏదోకాదు మనసులో మేదిలే ఆలోచనలను అక్షరాల్లో పేర్చి తరువాతి తరాలకు లిఖిత పూర్వకంగా అందజేసే మహత్తర ప్రక్రియ. కవిత్వము మనసు పొరల్లోంచి తన్నుకొచ్చే శక్తివంతమైన భావనల సమ్మేళనం. కవిత్వం ఒక సజనాత్మక సాహితీ ప్రక్రియ, అన్వేషణ, ఆవేదన, వ్యక్తపరచటం నిరంతర అధ్యయనంతో కవిత్వంతో రాటు దేలుతుంది. కవిత్వాన్ని చేపట్టిన గోవర్ధన్‌ రెడ్డి కషికి ‘కందిలిలి ఒక నిదర్శనం మాత్రమే.
గోవర్ధన్‌ జీవితం చిన్ననాటి నుంచే ఎత్తుపల్లాలను చవిచూసింది. అనుభవం నేర్పిన పాఠాలు, మరణించిన నాన్నను మననం చేసుకుంటూ తల్లి చెప్పిన తొవ్వలో నడుస్తూ తొవ్వంటి కనపడుతున్న బతుకుల్ని కవిత్వీకరిస్తున్నది. కవిత్వంలోకి మనము ప్రవేశించేలా, తనవైపు తిప్పుకుంటున్న తన కవిత్వానికున్న శక్తి మనల్ని చదివిస్తుందంటే అతిశమోక్తి కాదు. ఇష్టమైన పనిని ఎవరైనా మనసు పెట్టి చేస్తారు. అది మనసుల్ని కదిలించేలా ఉంటే.. గుర్తింపు వెతుక్కుని మరీ వస్తుంది. సమాజంలో చోటుచేసుకునే విషాదాలు, మూఢనమ్మకాల విపరిణామాలే తన కవితాంశాలుగా మినీ కవిత్వమై ప్రశ్నిస్తున్నాడీ యువకవి. సహజ వచన శైలితో సరళ వాడుక భాషలో సొంత గొంతుతో కలవరిస్తూ పలవరించే నిలువెత్తు నిరసన స్వరం గోవర్ధన్‌ రెడ్డి. ముక్కుసూటితనం ఎక్కువ. వస్తు విస్తతితోపాటు పలు సామాజిక సమస్యల్ని విభిన్న కోణాల్లో ఎండగడుతూ తూర్పారబెట్టడం ఈ కవి అంతర్గత చైతన్య దష్టిని తేటతెల్లం చేస్తుంది.
‘మూఢాచారపు/ చెరలో చిక్కిన ఆ మోహననారి/ సమ్మోహన శవాలకు/ తానొక స్మశానం’ అంటాడు. జోగిని మినీ కవిత్వంలో. తెలంగాణ సామాజిక వ్యవస్థలో అత్యంత అవమానకర సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు మతం ముసుగులో దళిత స్త్రీల లైంగిక బానిసత్వాన్ని, సామాజిక దోపిడీని ప్రతిబింబిస్తాయి. భారతదేశ చరిత్రలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సామాజిక పరిణామక్రమాన్ని పరిశీలిస్తే అనేక సామాజిక దురాచారాలు క్రమక్రమంగా తొలగిపోయాయి. కానీ జోగిని, దేవదాసి వ్యవస్థలు మాత్రం నేటికీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొనసాగుతూనే ఉండటాన్ని బట్టి వీటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ దూరాచారంపై తన కవిత్వం ఎక్కుపెట్టాడు గోవర్ధన్‌.
‘మంత్రతంత్రాల చింతలు/ మనిషి మస్తిష్కంలో/ గెరిల్లా యుద్థతంత్రాలై భ్రమిస్తుంటే / తన తలరాతకు/ తాయత్తే తాహత్తని తలుస్తూ/ హేతుతత్వ తలంపులకు/ తిలోదకాలిచ్చిన వైనమది..%-% అంటూ మూఢనమ్మకం కవిత ద్వారా సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతపై తన కలాన్ని ఝుళిపించాడు. సమస్యలు మూఢత్యంలో నుంచి పుట్టినవి అయినా, మరేరకమైన సమస్యలు అయినా.. వాటి పరిష్కారం మాత్రం భౌతిక వాస్తవికత ద్వారానే సాధ్యమవుతాయి. అంతేతప్పా.. మాయలు మంత్రాలు, క్షుద్రపూజలు వంటి అశాస్త్రీయమైన మార్గాలేవి ఉండవు. ఇలాగాకుండా.. పూజలు, ప్రార్థనలు, ప్రసాదాలు, మంత్రించడాలు, శివసత్తులు అభయమివ్వడం, ఆయిల్‌ పూయడం, సేవించడం లాంటివి ప్రయోగిస్తే, ఏమీ
ఫలితముండదు. వ్యాధి ముదిరి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాపోతారని బలంగా నమ్మిన యువకుడు గోవర్ధన్‌. కాబట్టే సమాజాన్ని చైతన్యపరిచే పనికి కలంతో సమాయత్వం అయ్యాడు.
అలిశెట్టి ప్రభాకర్‌కు ఎంతో పేరు తెచ్చిన వేశ్య కవిత- ‘తను శవమై../ ఒకరికి వశమై…/ తనువు పుండై…/ ఒకడికి పండై../ ఎప్పుడూ ఎడారై…/ ఎందరికో ఒయాసిస్సై..’లో ఉన్నవి మొత్తం పన్నెండు పదాలే. ‘వేశ్య కవిత అంటే గుర్తుకు వచ్చేది అలిశెట్టి ప్రభాకరే. ‘వేశ్య కవితను గోవర్థన్‌ కూడా అంతే ఘాటుగా రాశాడు. ‘ విటులకు వెలయాలై/ సంభోగ సాగరంలో టైటానిక్‌ లా/ మునిగిపోతున్న తన జీవితం/ లైఫ్‌ లైబ్రరీలో ఒక ట్రాజెడి పుస్తకం ‘గా వేశ్య జీవితాన్ని అలతి అలతి పదాలతో చిత్రిస్తాడు గోవర్థన్‌. అలిశెట్టి అక్షరాలు ద్వారా పొందిన స్ఫూర్తితో ‘ అలిశెల్టి అక్షరాలను చదువుతుంటే/ సమాజానికి పట్టిన దూర్నీతి స్వేదాన్ని తుడుస్తూ/ అడవి మెడపై వాలిన/ ఎర్రటి జేబురుమాళ్లను చూస్తున్నట్టుంది అంటాడు ఈ యువకవి.
వ్యాయామ ఉపాధ్యాయుడే కాకుండా అతనికున్న సాహిత్యాభిలాషతో సాహిత్యరంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ధరిత్రి సాహితీ సమూహం వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో ”చిత్తు కాగితం” అనే కవితకు గాను రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి అందుకున్నాడు. మూఢ నమ్మకాలు అనే కవితకు గాను తెలంగాణ సాహితి నుంచి ప్రథమ బహుమతిని అందుకున్నాడు. 2018లో అనేక సామాజిక అంశాలతో కూడిన గోవర్ధన్‌ రెడ్డి కవితా సంపుటి ‘కందిలి’ని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం ఆవిష్కరించారు.
వర్తమాన సమాజం పట్ల నిబద్దత , రాజకీయ పరిజ్ఞానం , ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఇలా కవిత్వం రాయడానికి సరిపడా సరంజామా అంతా ఇతని దగ్గర సిద్దంగా ఉంది. వస్తు ఎంపిక, నిర్వహణ బాగుంది. ఇంకాస్త స్పష్టత ఉంటే అలిశెట్టి ‘చురకలు%-%లా సమాజానికి చురకలు అంటించవచ్చు.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

Spread the love