– వదోదరలో ప్రారంభించిన మోడీ, శాంచెజ్
వడోదర : మిలిటరీ విమానాల తయారీకి సంబంధించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను సోమవారం వడోదరలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సంయుక్తంగా ప్రారంభించారు. సి295 విమానాన్ని ఇక్కడ రూపొందించ నున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి మిలటరీ విమానాలను తయారుచేసే ప్రయివేటు ప్లాంట్ ఇది. భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యం కొత్త దిశలో సాగుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవడమే కాకుండా ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ మిషన్ వూపందుకుంటుందని పేర్కొన్నారు. ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఇరువురు నేతలు సందర్శించారు. నూతన భారతదేశంలో నూతన పని సంస్కృతిని ఈ ఫ్యాక్టరీ ప్రతిబింబిస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. ఏ ప్రాజెక్టు సంబంధించినదైనా ఆలోచన నుండి అమలు వరకు భారత్ ఎంత వేగంతో పనిచేస్తుందో ఈ ఫ్యాక్టరీలో చూడవచ్చని అన్నారు. 2022 అక్టోబరులో ఈ ప్లాంట్‌కు పునాది వేశారు. ప్రాజెక్టుల విషయంలో అనవసరమైన జాప్యాలను పూర్తిగా నిర్మూలించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. భారత్‌లో ఇంత పెద్ద ఎత్తున రక్షణ తయారీ జరుగుతుందని దశాబ్ద కాలం క్రితం ఊహించను కూడా ఊహించలేదన్నారు. టాటా ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ వల్ల వేలాది ఉద్యోగాలు కొత్తగా వస్తాయన్నారు. 18వేల విమాన భాగాల దేశీయ తయారీకి ఈ ఫ్యాక్టరీ తోడ్పాటునందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు అపారంగా అవకాశాలు అందుతాయన్నారు. ప్రపంచంలోనే ప్రదాన విమాన కంపెనీలకు అవస రమైన విడి భాగాల ప్రధాన సరఫరాదారుల్లో భారత్ కూడా వుందన్నారు. ఎయిర్‌బస్ సి29 ఒక మోస్తరు రవాణా విమానం. దీన్ని తొలుత స్పెయిన్ ఏరోస్పేస్ కంపెనీ సిఎఎస్‌ఎ డిజైన్ చేసి నిర్మించింది. ప్రస్తుతం యురోపియన్ దేశాల ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ డివిజన్‌లో భాగంగా వుంది. ఈ విమానాలను వైద్య పరమైన తరలింపులకు, విపత్తు సమయాల్లో, సముద్ర జలాల్లో గస్తీకి ఉపయోగిస్తారు.
భారత్ పర్యటనలో స్పెయిన్ ప్రధాని
స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్ పర్యటనలో భాగంగా సోమవారం తెల్లవారుజామున వడోదర నగరానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సోమవారం ఉదయం రోడ్‌షోలో పాల్గొన్నారు.