డీసీఎంఎస్ కేంద్రాలపై ఉన్న శ్రద్ధ  పీఏసిఎస్ కేంద్రాలపై లేదు

– తాడిచెర్ల పీఏసిఎస్ డైరెక్టర్లు ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
డీసీఎంఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఉన్న శ్రద్ధ జిల్లా ఉన్నతాధికారులకు పీఏసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై లేదని సింగిల్ విండో వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు, డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు, సర్వర్ నాయక్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రెండు వరాల క్రితమే పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలన్నారు. మండలంలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలని, ఈ కేంద్రాల ద్వారా రైతులను తరుగు పేరుతో దోచుకుంటున్నారని విన్నవించినా పట్టించుకోకుండా ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు వళ్లెంకుంట,మల్లారం గ్రామాల్లో  డిసిఎంఎస్ కొనుగోలు ప్రారంభించడం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రాలు నడపడం ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదాయం తగ్గుతుందన్నారు.ప్రతి సంవత్సరం 12 పీఏసిఎస్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సొసైటీ అభివృద్ధి కోసం తాము పాటుపడుతున్నట్లుగా వివరించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు డిసిఎంఎస్ కొనుగోలు రద్దు చేసి పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.లేదంటే సొసైటీలో ఉన్న రైతుల భవిష్యత్ ప్రశ్నర్ధకరంగా మారుతుందన్నారు.
Spread the love