– ‘కుంభకోణాల’ కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు
– మాయమాటలతో మోసం చేస్తున్న బీఆర్ఎస్
– సీపీఐ(ఎం) జనగామ అభ్యర్థి మోకు కనకారెడ్డికే మీ ఓటు : పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-చేర్యాల
దేశంలో రాజ్యాంగాన్ని, లౌకికతత్వాన్ని ధ్వంసం చేస్తూ కుల, మతాల పేరుతో ప్రజలపై దాడి చేస్తున్న మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న సీపీఐ(ఎం) జనగామ అభ్యర్థి మోకు కనకారెడ్డికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ అధ్యక్షతన గురువారం జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేదలపై భారాలు వేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశం అత్యంత పేదరికంలో కూరుకుపోవడానికి, అనేక కుంభకోణాలు చేసి దేశాన్ని దివాళా తీయించిన కాంగ్రెస్‌కు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేండ్లు అయినా, ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయి యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు. పేదలకు ఇచ్చిన హామీలైన ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, దళితులకు మూడు ఎకరాల భూమి, ప్రతి ఎకరాకు సాగునీరందిస్తానని అనేక ప్రగల్బాలు పలికిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కష్టజీవుల హక్కులు, అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలే ఊపిరిగా వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, శెట్టిపల్లి సత్తిరెడ్డి, సందబోయిన ఎల్లయ్య, మండల కార్యదర్శులు కొంగరి వెంకట మావో, ఆలేటి యాదగిరి, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, రామ్‌సాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, సిద్దిపేట, జనగామ జిల్లా కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.