భ‌విష్య‌త్తు ఎర్ర‌జెండాదే

MA Baby as new CPI(M) General Secretary– ఇప్పటికే సోషలిజం నీడలో 25 శాతం ప్రపంచం : సీపీఐ(ఎం) నూతన కార్యదర్శి ఎంఏ బేబీ
– వక్ఫ్‌ సవరణ వెనుక ప్రమాదకర వ్యూహం : కేరళ సీఎం పినరయి విజయన్‌
– బుల్డోజర్‌ రాజకీయాలను అడ్డుకునే శక్తి వామపక్షాలకే : సీపీఐ(ఎం) సీనియర్‌ నేత బృందాకరత్‌
– మదురైలో దిగ్విజయంగా ముగిసిన సీపీఐ(ఎం) 24వ మహాసభ
ఎన్‌ శంకరయ్య మైదానం నుంచి నవతెలంగాణ ప్రతినిధి
ప్రపంచంలో ఎర్రజెండాదే భవిష్యత్తు అని సీపీఐ(ఎం) నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత మదురైలోని ఎన్‌. శంకరయ్య మైదానం (రింగ్‌రోడ్‌ గ్రౌండ్‌)లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని 25 శాతం మంది ఇప్పటికే సోషలిజం నీడలో ఉన్నారని, అభ్యుదయ శక్తుల పాలనలో ఉన్న దేశాల జనాభాను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అన్నారు. దీనికి సంబంధించిన గణాంకాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఈ నెల రెండవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు స్థానిక సీతారాం ఏచూరి నగర్‌ లో జరిగిన సీపీఐ(ఎం) అఖిల భారత 24వ మహాసభ ఆదివారం నాటితో దిగ్విజయంగా ముగిసింది. అనంతరం స్థానిక మదురై పాండి గుడి సెంటర్‌ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనకు ముందుభాగంలో వేలాదిమంది రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు ఎర్రసముద్రంగా కనిపించాయి. బహిరంగ సభకు సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం అధ్యక్షత వహించారు. లక్షలాదిమందితో శంకరయ్యమైదానం, పరసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా బేబీ మాట్లాడుతూ చారిత్రాత్మకంగా ప్రఖ్యాతిగాంచిన మదురైలోని వైగైనది ఎరుపురంగు సంతరించుకున్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రధాన కార్యదర్శి హౌదాలో తొలిసారి ఆయన చేసిన ప్రసంగం కవితాత్మకంగా పోలికలతో, ఉదాహరణలతో సాగింది. పలువురు ప్రజా రచయితల, కవుల రచనలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు హాజరైన ప్రజానీకం పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఆయన ప్రసంగం సాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా వర్షం ప్రారంభమవడంతో కలకలం రేగింది. సభ నుంచి కొందరు వెళ్లిపోవడం ప్రారంభించారు. దీంతో ‘ ఇప్పుడు మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సభను అర్ధంతరంగా ముగించుకుని వెళ్లడం, రెండవది అవాంతరాలు ఎదురైనా సభను నిర్వహించుకుని ముందుకు వెళ్లడం. ఎంతటి త్యాగానికైనా సిద్ధమని చెప్పే మనం ఈ చిన్నపాటి వర్షానికే భయపడతామా? మనకు భయం లేదు. ఏ శక్తులు మనల్ని భయపెట్టలేవు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మన ప్రయాణం ముందుకే..’ అని అన్నారు. దీంతో ఎక్కడి ప్రజానీకం అక్కడే ఆగిపోయారు. కుర్చీలను తలలమీద పెట్టుకుని బేబి ప్రసంగాన్ని చివరి వరకూ విన్నారు. ఉపన్యాసాన్ని కొనసాగించిన బేబీ క్యూబా, ఉత్తర కొరియా, చైనా తదితర దేశాలలో కమ్యూనిస్టుల పాలనను ప్రస్తావించారు. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ వామపక్ష విధానాలను ఆమోదించే పార్టీలు అధికారంలోకి వచ్చాయని చెప్పారు. మనకు పొరుగునే ఉన్న శ్రీలంకలోనూ వామపక్షం అధికారంలోకి వచ్చిందని వివరించారు. నేరుగా కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష భావజాలంతో అధికారంలో ఉన్న దేశాల్లోని ప్రజలను కలుపుకుంటే, 25 శాతం కన్నా ఎక్కువ జనాభా సోషలిజం నీడలో ఉందని వివరించారు, పెట్టుబడిదారి విధానపు సంక్షోభంతో ఎన్నో దేశాల ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు పెట్టుబడిదారీ విధానపు అసలు స్వభావాన్ని, దానిలోని భయాన్ని ప్రపంచ ప్రజానీకం ముందు బట్టబయలు చేస్తున్నాయని చెప్పారు. దీనికి భిన్నంగా చైనా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించి ముందుకు సాగుతూ, ప్రపంచ ప్రజలకు కొత్త మార్గాన్ని చూపుతోందని అన్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు ఉద్యమంలోని బలహీనతలనూ ఆయన ప్రస్తావించారు. ‘ఈ మాటలు మనం చెబుతున్నామంటే దీనర్ధం అంతా బాగుందని కాదు. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం కొన్ని సంవత్సరాలుగా బలహీనపడింది. ఎదురుదెబ్బలు తగిలాయి. దీనిని మనం అంగీకరించాలి. కేరళలో వరుస ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించాం. అదే సమయంలో బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తాకాయి. వీటిని గుర్తించి సరిదిద్దుకుని ముందుకు సాగాలి. అక్కడ మన కామ్రేడ్లు పోరాడుతున్నారు’ అని అన్నారు. దేశంలో ప్రస్తుతం తిరోగామి శక్తులు అధికారంలో ఉన్నాయని అన్నారు.
మతోన్మాద, కార్పొరేట్‌ శక్తుల కూటమి అధికారంలో ఉందని, నయా ఫాసిస్టు విధానాలను దేశంపై రుద్దుతూ భయోత్పాతాన్ని సృష్టిస్తోందని చెప్పారు. ఈ విధానాలను ఎదిరించి, ప్రజలను సంఘటితం చేసి ముందుకు సాగాలని 24వ మహాసభ పిలుపునిచ్చిందని, ఆ లక్ష్యాలను సాధించడానికి సీపీఐ(ఎం)ను, వామపక్షాలను బలోపేతం చేయాలని అన్నారు. తన ప్రసంగంలో ఆయన ఇటీవల మరణించిన సీతారాం ఏచూరి, కొడియేరి బాలకృష్ణన్‌, బుద్దదేవ్‌ భట్టాచార్యలకు నివాళులర్పించారు. తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎంఏ బేబీ ప్రస్థానంMA Baby as new CPI(M) General Secretary
– ఎంఏ బేబీ (మరియం అలెగ్జాండర్‌ బేబీ) 1954 ఏప్రిల్‌ 5న కొల్లంలోని ప్రాక్కులంలో పి.ఎం.అలెగ్జాండర్‌, లిల్లీ అలెగ్జాండర్‌ దంపతులకు జన్మించారు.
– విద్యార్థిగా రాజకీయాల్లోకి ప్రవేశించి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) కేరళ రాష్ట్ర అధ్యక్షుడిగా, అనంతరం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
– కొల్లం ఎస్‌ఎన్‌ కళాశాలలో బీఏ పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేశారు.
– పుస్తక పఠనం, చర్చలలో పాల్గొన్నడం ఆయన అభిరుచులు. దీంతో తరచూ వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీల్లో పాల్గొంటూ గుర్తింపు పొందారు.
– 1987లో డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ)కు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
– 1989లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.
– 32 ఏండ్లకే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.
– ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు
– 1985లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు
– 2006లో ఆయన కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
– 2006 నుంచి 2011 వరకు అచ్యుతానందన్‌ మంత్రివర్గంలో విద్య, సాంస్కతిక శాఖా మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీయేతర వర్గాలను సైతం తన పని తీరుతో ఆకట్టుకున్నారు.
– 2012లో కొజికోడ్‌లో జరిగిన ఆ పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన తొలిసారి పొలిట్‌బ్యూరోలోకి వెళ్లారు.
– 2025లో మదురైలో జరిగిన 24వ మహాసభలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు.
– ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించిన నాయకులలో ఆయన ఒకరు.
– కేరళ నుంచి సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో వ్యక్తి ఎంఏ బేబీ
– ఆయన జీవిత భాగస్వామి బెట్టీ లూయిస్‌, కుమారుడు అశోక్‌ బెట్టీ నెల్సన్‌.
సవాళ్లను అధిగమిద్దాం
‘పార్టీ 24వ మహాసభ అనేక సంక్లిష్ట పరిస్థితుల మధ్య జరిగింది. సీతారాం ఏచూరి, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొడియేరి బాలకృష్ణన్‌ లేని లోటు పూడ్చలేకుండా ఉంది.
ఆ బాధను దిగమింగుకుంటూనే మహాసభల ఏర్పాట్లపై పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ దృష్టి సారించాయి. పరస్పర సహకారం, సమన్వయంతో ి మహాసభను దిగ్వి జయంగా ముగించాం. ప్రస్తుతం కార్పొరేట్‌, కమ్యూనల్‌ (మతోన్మాదం) గొలుసును ఛేదించటమనే అంశంపై అధ్యయనం చేయాలి. పార్టీ రాజకీయ వ్యూహా త్మక పంథాకు అదే కీలకం. కార్మికవర్గ పార్టీగా ఆర్థిక పోరాటాలను కొనసాగిస్తూనే ప్రజల మధ్య చీలికలు తెస్తున్న కేంద్రంలోని బీజేపీ, దాని వెనకున్న ఆరెస్సెస్‌ కుట్రలను తిప్పికొట్టాలి. మోడీ హయాంలో నయా ఫాసిస్టు ధోరణులు పెచ్చరిల్లుతున్న తరుణంలో వాటి నుంచి దేశాన్ని రక్షించాలి.

Spread the love