శోణగిరినేలే రాజు విజయవర్థనుడికి వేట మీద మక్కువ ఎక్కువ. ఆయన తరచూ తన పరివారంతో అరణ్యానికి వేటకు వెళుతూ వినోదిస్తూ వుండేవాడు. ఒకసారి ఆయన వేటాడుతూ పరివారం నుంచి వేరుపడ్డాడు. వేగంగా గుర్రంపై వెళుతూ బాగా కిందకు దిగి వున్న పెద్ద చెట్టు కొమ్మ తగిలి కిందపడ్డాడు. తలకు బాగా గాయమైంది. రక్తం కారసాగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక ఆటవిక యువకుడు రాజుగారిని చూసి, కూర్చోబెట్టాడు. దగ్గరలో వున్న పొద నుంచి ఆకులు తుంచి చేతులతో నలిపి రసం తీసి, దాన్ని గాయం మీద రాశాడు. పెద్ద ఆకు దానిమీద పెట్టి గట్టిగా కట్టు కట్టాడు. అదేం చిత్రమోగాని క్షణాల్లో నొప్పి మాయమైంది, రక్తం కారడమూ తగ్గింది. అంతలో రాజుగారిని వెతుక్కుంటూ భటులు అటుకేసి వచ్చి విషయం తెలుసుకుని రాజుగారిని జాగ్రత్తగా అంతఃపురం చేర్చారు.
రాజవైద్యుడు కట్టుకు వాడిన ఆకును పసిగట్టి ”చూడబోతే వీడెవడో ఆకుల గురించి బాగా తెలిసినవాడిలాగ వున్నాడు. గాయాన్ని నిమిషాలమీద నయం చేసే ఆకు రసం వాడాడు” అన్నాడు. రాజుగారు భటుల్ని అడవికి పంపాడు. వాళ్ళు అడవిలో వాడ్ని వెతికి అంతఃపురానికి తీసుకొచ్చారు. వాడితో రాజు ”నీకు ఏమిచ్చినా ఋణం తీరదు” అంటూ ఘనంగా కానుకలిచ్చాడు.
అప్పుడు ఆ యువకుడితో రాజవైద్యుడు, ”నీకు అడవిలో ఆకులు, మూలికల గురించి బాగా తెలిసినట్టుంది” అన్నాడు.
”లేదయ్యా తెలుసుకోవాలన్న ఆసక్తి మటుకు వుంది. ఒకసారి నా కాలికి గాయమైతే పెద్దాయన ఒకరు ఈ ఆకు రసం పూశారు. క్షణాల్లో నయమైంది. అప్పుడు. ఈ ఆకును గుర్తుంచుకున్నాను. తరవాత కొద్దిపాటి ప్రయత్నం మీద కొన్ని ఆకులకున్న ఔషదగుణాలను తెలుసుకున్నాను” అన్నాడు.
ఆ యువకుడి ఆసక్తికి, వినయానికి రాజు సంతోషపడి ”నువు అడవిలో కాదు ఉండాల్సింది. రాజధానిలో వుండి మూలికావైద్యం రాజవైద్యుని వద్ద నేర్చుకో” అన్నాడు.
ఇందుకు రాజవైద్యుడు కూడ ఎంతో ఆనందించాడు. నాలుగయిదేళ్ళు ఆ యువకుడు రాజధానిలో వుండి రాజవైద్యుని వద్ద మూలికావైద్యాన్ని బాగా వంటబట్టించుకున్నాడు. తరవాత ఒకరోజు రాజవైద్యుడు అతనితో ”నీ విద్య పూర్తయ్యింది. ఇక నువు నగరంలో ఎక్కడో ఒకచోట వైద్యం చేయడం ప్రారంభించవచ్చు.. అందువల్ల నీకూ బతుకుతెరువు. ప్రజలకూ మేలు కలుగుతుంది” అన్నాడు.
అందుకు అతను ”అయ్యా! మన్నించండి. మీ వద్ద వైద్యం నేర్చుకుంటున్నవారు ఎందరో వున్నారు. వారు నగరంలో భవిష్యత్‌లో వైద్యం చేయగలరు. కానీ మా అడవిలో అలాంటి సౌకర్యం లేదు. అందువల్ల నేను మీ ఆదరణ వల్ల పొందిన విద్యను నా అడవి ప్రజల కొరకే ఉపయోగించాలి అనుకుంటున్నాను. మీరు మన్నించాలి” అన్నాడు.
అంతా వింటున్న రాజు మహదానందంతో ”నీలో వైద్యం పట్ల ఆసక్తే కాదు, ప్రజాసేవ పట్లకూడ మనసు వుంది. గమనిస్తే నీలోఒక ఆదర్శవైద్యుడు వున్నాడు. వైద్య సౌకర్యం లేనివారికి వైద్యం అందిచాలనుకుంటున్నావు. తన గురించే కాక తనవారిని గురించి ఆలోచించేవాళ్ళు అన్నివిధాలా గొప్పవారు. అందులోనూ ఒక వైద్యుడు అలా ఆలోచిస్తున్నాడంటే అంతకంటే కావాల్సిందేముంది? నీకు మా సహాయం ఎప్పుడూ వుంటుంది” అంటూ ఆ ఆటవిక యువకుడ్ని ఘనంగా సన్మానించి పంపాడు. అంతటితో ఊరుకోక అడవిలో అతనికి ఒక వైద్యశాలను కట్టించి యిచ్చాడు.
డా. గంగిశెట్టి శివకుమార్