– రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్
– బస్టాండ్ సెంటర్లో తాతా మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
నవతెలంగాణ-సత్తుపల్లి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అసభ్య పదజాలంతో దూషించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ తాతా మధులను శాసనసభ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ రింగ్ సెంటర్లో కాంగ్రెస్ శ్రేణులు మధు, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, విజయకుమార్ మాట్లాడుతూ, స్పీకర్ దళితుడనే కారణంతోనే ఆయనపై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. దళిత నేతను అవమానించడం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని స్పష్టం చేశారు. స్పీకర్ పదవిని, దళిత సమాజాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
సభ గౌరవాన్ని మంటగలిపేలా ప్రవర్తించిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి కేటీఆర్‌లపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారిద్దరి పదవులను వెంటనే డిస్మిస్ చేయాలని దయానంద్ విజయకుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ద్వారకాపురిలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. అక్కడి నుంచి బాలాజీ థియేటర్ మీదుగా రింగ్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, దొడ్డా శ్రీనివాసరావు, మట్టా ప్రసాద్, గ్రాండ్ మౌలాలి, పింగుల సామేలు, నరుకుళ్ళ అప్పారావులతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.



