
నవతెలంగాణ – భువనగిరి
పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి లోని సుందరయ్య భవనంలో సీఐటీయూ జిల్లా కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన భూపాల్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నుండి 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాలు జీవోలను విడుదల చేయలేదని నూతన కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తుందని కార్మికులు ఆశగా ఎదురు చూశారని కానీ కార్మికులకి నిరాశ ఎదురైందని తెలియజేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం,కార్మిక శాఖ జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ నోటిఫికేషన్లు కార్మికులకు కనీస వేతనం 11 వేలకు పరిమితం చేస్తూ విడుదల చేసిందని తెలియజేశారు. దీనిపైన మార్చ్ 31 వరకు కార్మికుల అభ్యంతరాలు తెలియజేయాలని కార్మిక శాఖ కోరిందని తెలియజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26,000 తగ్గకుండా నిర్ణయించాలని డిమాండ్ చేస్తుంటే రూ.11000 చేయడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక యజమానులకు లొంగి పనిచేస్తుందని అర్థమవుతుందని విమర్శించారు. డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా సూచన ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం శాస్త్రీయంగా కనీస వేతనాలు నిర్ణయించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం తమ ఇష్టానుసారంగా యాజమాన్యాలకు అనుకూలంగా వేతనాలు నిర్ణయిస్తున్నారని విమర్శించారు. ప్రతి కార్మికుడు రోజుకు కనీసం రూ.2700 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తినాలని డాక్టర్ ఆక్రయిడ్ ఫార్ములా చెప్తుందని ఇదేది ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలోభగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి జోహార్లు అర్పించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు దాసరి పాండు,కల్లూరు మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా ,జిల్లా సహాయ కార్యదర్శులు మాయ కృష్ణ, బోడ భాగ్య, సుబ్బురు సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్,పోతరాజు జహంగీర్, పైల గణపతి రెడ్డి ,పొట్ట యాదమ్మ, మోరిగాడి రమేష్ ,బందేల బిక్షం,గడ్డం వెంకటేష్ భత్తుల దాసు పాల్గొన్నారు.