‘మా నాన్నను కొట్టించిన ఎమ్మెల్యే ఓడిపోవాలి’

'మా నాన్నను కొట్టించిన ఎమ్మెల్యే ఓడిపోవాలి'– పదేండ్ల చిన్నారి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం
– కాంగ్రెస్‌ అభ్యర్థి జయవీర్‌కు ఐదువేలు విరాళమిచ్చిన చిన్నారి
నవతెలంగాణ -పెద్దవూర
ఏదైనా పార్టీ మీద అభిమానం ఉంటే చేతనయినంత ఆర్థిక సహాయం చేస్తారు.. మరికొందరు భోజనం పెట్టి అభిమానం చాటుతారు. కానీ ఈ పదేండ్ల చిన్నారి అవతల పార్టీ మీద కోపంతో ఏమీ ఆశించకుండా జోరుగా ప్రచారం చేయడమే కాక ప్రత్యర్థి అభ్యర్థికి రూ5000 విరాళం కూడా ఇచ్చింది. పాప తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం తండాకు చెందిన తన్నీరు జ్ఞానప్రసన్న (10) నాగార్జున సాగర్‌లో ఐపీఎస్‌ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నది. ఆ పాప తండ్రి తన్నీరు సతీష్‌ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అప్పటినుంచి కేసీఆర్‌ మీద అభిమానంతో బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కృషిచేశారు. అలాంటి మా నాన్నను ఎమ్మెల్యే నోముల భగత్‌ కొట్టించారని తెలిపింది. కాగా, తండాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జయవీర్‌ దగ్గరికి వెళ్లిన ఆ పాప.. ‘మా నాన్నను కొట్టించిన ఎమ్మెల్యే భగత్‌ ఈ ఎన్నికల్లో ఓడిపోవాలని విన్నవించింది. ఎలాగైనా మీరే గెలవాలి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. దాని కోసం తాను దాచుకున్న పాకెట్‌ మనీ రూ. 5000 జయవీర్‌కు ఇచ్చింది. తన నాన్నను కొట్టినందుకు ఆ చిన్నారి తన మనోవేదనను ధైర్యంగా వ్యక్తం చేయడంతో గ్రామ ప్రజలు అభినందించారు.

Spread the love