ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లకు
ప్రాధాన్యత ఇవ్వాలి :పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద చేపడుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం అమలు, పనుల పురోగతి, నిధుల వినియోగంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రస్తుతం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.589 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయనీ, వీటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం ద్వారా అదనంగా మరో రూ.600 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించి, ఒక్క రూపాయి కూడా వెనక్కి వెళ్లకుండా అన్ని నిధులను సద్వినియోగం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రైతులకు ఉపయోగపడే పొలం బాటల నిర్మాణం, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్రామీణ రవాణా సౌకర్యాలు మెరుగుపడితే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుందని, రైతులకు అదనపు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇటీవల వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన 8000 మహిళా గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణ పనుల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలనీ, నిర్ణీత గడువులోపు కనీసం 50 శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాల పనులను కూడా వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులను వినియోగించాలని సూచించారు. జులై 1 నుంచి వీబీజీ రాంజీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జూన్ చివరి వరకు ఉపాధి హామీ నిధులను పూర్తిస్థాయిలో వ్యయం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



