న్యూఢిల్లీ : నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ కానల్ ఈ నెల 5 నుండి ఏడవ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. మే 31న నేపాల్ పార్లమెంట్‌లో ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలతో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. భారత్‌తో దీర్ఘకాలంగా సరిహద్దు వివాదం వుందని, దీనిపై భారత్‌తో చర్చించడంతో పాటూ చైనా, బ్రిటన్‌లతో కూడా టచ్‌లో వున్నట్లు బాలేంద్ర షా చెప్పారు. రెండు రోజుల తర్వాత భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. నేపాల్‌తో గల సరిహద్దు వివాద పరిష్కారానికి తృతీయ పక్షాల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. జై శంకర్‌తో శిశిర్ కానల్ సమావేశమవుతారని, పరస్పర ప్రయోజనం కలిగిన అంశాలు చర్చిస్తారని నేపాల్ ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపింది.
నేటి నుండి భారత్‌లో నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన
- Advertisement -
- Advertisement -



