Wednesday, August 5, 2026
E-PAPER
Homeజాతీయంమహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలులో జాప్యమొద్దు

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలులో జాప్యమొద్దు

- Advertisement -

ఎన్‌‌సీడబ్ల్యూఆర్‌ ఆధ్వర్యంలో
12వ రోజుకు ఆందోళన
​సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌, బృందాకరత్‌ సంఘీభావం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలులో జాప్యం వ‌ద్దని సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్ డిమాండ్ చేశారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ‘నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్స (ఎన్‌సీడబ్ల్యూ ఆర్‌) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళ‌న 12వ రోజు కొనసాగింది. మంగ‌ళ‌వారం ఢిల్లీ నుం‌చే కాకుండా రాజస్థాన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు తమ సంప్రదాయ రంగుల దుస్తులను ధరించి ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కోరుతూ పాటలు కూడా ఆలపించారు. ఈ సంద‌ర్భంగా సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో మహిళలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కును సాధించేందుకు సీపీఐ(ఎం) పార్లమెంటు లోనూ, బయటా నిరంతరం పోరాడుతోందని అన్నారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి షరతులతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన పునరుద్ఘా టించారు. పార్లమెంటులో ఈ డిమాండ్‌ను బలంగా లేవనెత్తామని, ఈ అంశంపై దేశంలోని మహిళలకు బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును వాయిదా వేయడానికి విధించిన షరతులు అన్యాయమైనవనీ, వివక్షతో కూడినవని రాజ్యసభ మాజీ సభ్యురాలు బృందా కరత్ తెలిపారు. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిరాకరించడం ప్రజాస్వామ్య సూత్రాలకు ద్రోహం చేయడమేనని, ప్రభుత్వం ఎటువంటి జాప్యం లేకుండా 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడటానికి మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడం అత్యవసరమని ఎన్ఎఫ్ ఐడ‌బ్ల్యు అధ్యక్షురాలు సయ్యదా హమీద్ అన్నారు. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలన్న డిమాండ్‌ను ఆమె పునరుద్ఘాటించారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ మహిళలు తమ బాధ్య‌త‌ను నిరూపించుకున్నప్పటికీ, రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం అత్యంత తక్కువగా ఉందని ఐద్వా ఉపాధ్యక్షురాలు, మాజీ ఎంపీసుభాషిణి అలీ సెహగల్ అన్నారు. పార్లమెంటు,రాష్ట్ర శాసనసభలలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం లభిస్తే భారత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. క్రీడలు, విద్య, విజ్ఞానశాస్త్రం, వ్యవసాయం, కార్మిక రంగాలలో మహిళలు అద్భుతమైన కృషి చేశారని, నిర్ణయాలు తీసుకునే అన్ని వేదికలలో వారికి సమాన భాగస్వామ్యం దక్కాలని ఐద్వా ఉపాధ్యక్షురాలు, అంతర్జాతీయ క్రీడాకారిణి జగ్మతి సాంగ్వాన్ అన్నారు.
విధాన రూపకల్పనలో దేశవ్యాప్తంగా ఉన్న మహిళల, ముఖ్యంగా గ్రామీణ, శ్రామిక మహిళల గళానికి అర్థవంతమైన ప్రాతినిధ్యం లభించేలా మహిళా రిజర్వేషన్ల అమలు దోహదపడుతుందని ఎన్ఎఫ్ఐడబ్య్లూ ప్రధాన కార్యదర్శి నిషా సిధు పేర్కొన్నారు. ఐద్వా రాజస్థాన్ రాష్ట్ర కార్యదర్శి సీమా జైన్ కూడా ప్రసంగించారు. ఈ ఆందోళనలో ఐద్వా జాతీయ‌ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ పి.కె. శ్రీమతి, ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్, కార్యదర్శి ఆశా శర్మ, సవిత, మంజీత్ రాఠీ, సర్బాని సర్కార్, ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యూ నేత‌ దీప్తి, ఏఐపీడబ్య్లూఎ జాతీయ కార్యదర్శి శ్వేత రాజ్, ‘టుగెదర్ ఫర్ ట్రాంక్విలిటీ’కి చెందిన భావనా శర్మతో పాటు వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -