దేశంలో పెరిగిన మహిళా కార్మికులు
తక్కువ వేతనాలు, అసంఘటిత రంగాలకే పరిమితం
వ్యవసాయం, పాడి, బీడీ, ఇంటిపనులే ఎక్కువ..
జీతాల్లోనూ భారీ అసమానతలు
మోడీ సర్కారు పాలనలో మహిళలకు అన్యాయం
కేంద్రంలోని మోడీ సర్కారు పాలనలో మహిళలకు అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతోంది. భారత్లో మహిళలు పెద్ద సంఖ్యలో పని ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారన్న గణాంకాలు చూడగానే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 2018లో సుమారు 10 కోట్లుగా ఉన్న మహిళా కార్మికుల సంఖ్య 2024 నాటికి 20 కోట్లకు పైగా పెరిగింది. కానీ వాస్తవం ఇంకోలా ఉంది. ఈ పెరుగుదల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, మెరుగైన వేతనాలు, భద్రమైన ఉద్యోగాలు తెచ్చిందా? అంటే లేదనే చెప్పొచ్చు. ఇది గణాంకాలను లోతుగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది.
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నప్పటికీ.. వారు ఎక్కువగా చేరుతున్న ఉద్యోగాలు తక్కువ వేతనాలు, తక్కువ భద్రత, తక్కువ సామాజిక గుర్తింపు ఉన్న రంగాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి. పాడి పరిశ్రమ, పశుపోషణ, బీడీ తయారీ, గృహ కార్మిక రంగాలే మహిళలకు ప్రధాన ఉపాధి వనరులుగా మారుతున్నాయి. మరోవైపు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పరిపాలన వంటి అధిక వేతన రంగాల్లో మహిళల వాటా మూడో వంతుకంటే తక్కువగా ఉంది.
సమానత్వం ఎక్కడ?
భారత్లో మహిళల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అయితే.. ఇంటి పనులు కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే మహిళల వాటా మాత్రం చాలా తక్కువగా ఉంది. 2005 తర్వాత రెండు దశాబ్దాల పాటు మహిళల కార్మిక భాగస్వామ్యం క్షీణించింది. మోడీ పాలనలో 2018లో అది కనిష్ఠ స్థాయికి చేరింది. అయితే భారత్లో స్త్రీ, పురుషుల మధ్య ఉద్యోగ సమానత్వం లేదనే చెప్పొచ్చు. 2025 నాటికి దేశ కార్మిక శక్తిలో దాదాపు మూడిం ట ఒక వంతు మహిళలే. 2018 తర్వాత అది 2005కు ముందు ఉన్న స్థాయినే తిరిగి చేరుకుంది.
గ్రామీణ మహిళలకు వ్యవసాయమే దిక్కు
మహిళల ఉపాధి పెరుగుదలలో ప్రధాన భాగం గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ రంగం నుంచే ఉంది. గ్రామీణ కార్మిక శక్తిలో దాదాపు 38 శాతం మహిళలే. పట్టణాల్లో మాత్రం మహిళల వాటా కేవలం 25 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో 2005 నుంచి 2018 మధ్య గణనీయమైన పతనం నమోదైంది. పరిశ్రమ, సేవల రంగాల్లో మహిళల వాటా నాలుగో వంతుకంటే తక్కువగా ఉండటం గమనార్హం. అంటే దేశంలో మహిళల ఉపాధి పెరుగుదల ప్రధానంగా అధిక ఉత్పాదకత, అధిక వేతన రంగాల్లో కాకుండా వ్యవసాయం, పశుపోషణ వంటి రంగాల్లోనే ఎక్కువగా జరిగింది.
పాడి.. పశుపోషణలో 80 శాతం మహిళలే
వ్యవసాయ రంగంలోని అనేక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగానే ఉంది. అయితే పాడి, పశుపోషణ రంగం ప్రత్యేకంగా మహిళా ఆధారితంగా మారింది. ఈ రంగంలోని ప్రతి 10 మంది కార్మికుల్లో దాదాపు ఎనిమిది మంది (అంటే 80 శాతం) మహిళలే.
బీడీ పరిశ్రమలో మహిళలే బలం..
వేతనమే చాలా తక్కువ
భారత్లో అత్యంత మహిళా ఆధారిత రంగాల్లో బీడీ తయారీ ఒకటి. బీడీ చుట్టే కార్మికుల్లో దాదాపు 90 శాతం మహిళలే. వారిలో చాలా మంది ఫ్యాక్టరీల్లో కాకుండా ఇండ్ల నుంచే పనిచేస్తు న్నారు. మహిళల ఆధిపత్యం పెరుగుతున్న ఈ పరిశ్రమ మాత్రం క్షీణిస్తోంది. అయితే ఇక్కడ సగటు వేతనం మొత్తం తయారీ రంగ సగటు వేతనంలో ఐదో వంతుకంటే తక్కువ ఉండటం గమనార్హం.
అధిక వేతన ఉద్యోగాలు ఎవరి కోసం?
దేశంలో మహిళలు చేరుతున్న ఉద్యోగాలు ఎక్కువగా తక్కువ వేతన రంగాల్లోనే ఉంటున్నాయి. సేవల రంగంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పరిపాలన వంటి అధిక వేతన కార్యకలాపాల్లో మహిళల వాటా మూడో వంతుకంటే తక్కువ. మరోవైపు గృహపని, సామాజిక సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో మహిళల వాటా ఎక్కువగా ఉంది. అయితే ఈ రంగాల్లో నెలవారీ వేతనం రూ.20,000 కంటే తక్కువే.
వేతన అంతరం ఎక్కువే!
పురుషులు-మహిళల మధ్య వేతన అంతరం కూడా తీవ్రంగానే ఉంది. సేవల రంగంలో పురుషుల నెలవారీ ఆదాయం సుమారు రూ.18,000 కాగా.. మహిళల ఆదాయం కేవలం రూ.10,500గా ఉంది. అంటే పురుషుల ఆదాయంలో మహిళలకు లభిస్తున్నది మూడింట రెండొంతుల కంటే కూడా తక్కువే.
ఇంటిపని కూడా పెద్ద ఉపాధి రంగమే!
పట్టణ మహిళలకు సేవల రంగం ప్రధాన ఉపాధి వనరుగా మారింది. పట్టణాల్లో పనిచేస్తున్న మహిళల్లో దాదాపు 60 శాతం మంది సేవల రంగంలో ఉన్నారు. అందులో గృహ కార్మిక రంగం వేగంగా పెరుగుతోంది. పట్టణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో రిటైల్, విద్య తర్వాత గృహపని మూడో అతిపెద్ద వనరుగా ఉంది. సేవల రంగంలో పనిచేస్తున్న ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి పైగా గృహ కార్మికురాలే. భారత్లో గృహ కార్మికుల్లో 70 శాతానికి పైగా మహిళలే.
అసంఘటిత రంగమే దిక్కా?
మహిళల్లో చాలామంది తక్కువ వేతన, అసంఘటిత, ఇంటి ఆధారిత, సామాజిక భద్రత తక్కువగా ఉన్న రంగాల్లోనే కేంద్రీకృతమవుతు న్నారు. అధిక వేతన ఉద్యోగాల్లో మహిళల వాటా ఎందుకు తక్కువగా ఉంది? పరిశ్రమ, ఆధునిక సేవలు, సాంకేతిక రంగాల్లో మహిళ లకు సమాన అవకాశాలు ఎందుకు కల్పించలేక పోతున్నాం? మహిళల ఉపాధిని కేవలం సంఖ్యల పెరుగుదలగా చూపించడం కాకుం డా.. నాణ్యమైన ఉద్యోగాలుగా మార్చేందుకు ప్రభుత్వ విధానాలు ఏమిటి? అన్నది కీలక ప్రశ్న. అయితే దీనికి సమాధానం చెప్పడంలో మాత్రం కేంద్రంలోని మోడీ సర్కారు విఫలమవుతోంది.



