ఈడీ, ఆదాయపు పన్ను శాఖ కేసుల వెనుక
సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ వి.శివదాసన్ డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఈడీ, ఆదాయపు పన్ను శాఖ కేసుల వెనుక ఉన్న వాస్తవాలను కేంద్రం వెల్లడించాలని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ వి.శివదాసన్ డిమాండ్ చేశారు. కేవలం నమోదైన కేసులు, అరెస్టుల సంఖ్యను మాత్రమే ప్రచారం చేయకుండా, విచారణల స్థితిగతులు, నిర్దోషులుగా విడుదలైన వారి వివరాలు, పెండింగ్‌లో ఉన్న కేసులు, విచారణ ఖైదీల వివరాలతో సహా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన కేసుల పూర్తి వివరాలను కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభలో శివదాసన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. నమోదైన కేసులు, అరెస్టుల గణాంకాలను అందించినప్పటికీ, దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థల పనితీరు, నిష్పాక్షికత, జవాబుదారీ తనాన్ని అంచనా వేయడానికి అవసరమైన అనేక కీలక అంశాలను ఆ సమాధానాలు వెల్లడించలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2021-22 నుంచి 2025-26 మధ్య కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్స (పిఎంఎల్ఎ) కింద 4,622 కేసులను నమోదు చేసి, 1,243 మందిని అరెస్టు చేసింది. అయితే, కేవలం 43 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. ఇది నమోదైన మొత్తం కేసులలో ఒక శాతం కంటే తక్కువ. ఈ కాలంలో కేవలం 104 మందికి మాత్రమే కోర్టులు శిక్ష విధించాయని, ఇది అరెస్టు అయిన వారిలో సుమారు 2 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ గణాంకాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం అనేక ప్రాథమిక పార్లమెంటరీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించిందని ఆయన ఎత్తిచూపారు. ఎన్ని ఈడీ కేసులు వాస్తవానికి విచారణ దశకు చేరుకున్నాయి. ఎన్ని కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదేండ్లకు పైగా పరిష్కారం కాకుండా ఎన్ని మిగిలిపోయాయి? ఒక కేసును ముగించడానికి పట్టే సగటు సమయం ఎంత? ఎంతమంది నిర్దోషులుగా విడుదలయ్యారు. అరెస్టు అయిన వారిలో ఎంతమంది ఇంకా విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారు? వంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
అరెస్టులకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. కానీ ఆ అరెస్టుల వల్ల వచ్చిన న్యాయపరమైన ఫలితాల వివరాలు మాత్రం వారి వద్ద లేవు. లేదా వాటిని వెల్లడించడానికి వారు ఇష్టపడటం లేదా?. ఇది పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయ నిర్వహణపై తీవ్ర ఆందోళనలను కలిగిస్తోందని శివదాసన్ అన్నారు.
ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన సమాధానం కూడా ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. గత ఐదేండ్లలో 2,127 ప్రాసిక్యూషన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 233 కేసుల్లో మాత్రమే శిక్ష పడింది (11 శాతం కంటే తక్కువ), కాగా 854 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇది దర్యాప్తు సంస్థ యొక్క సామర్థ్యం, నాణ్యత, ముఖ్యంగా దాని నిష్పాక్షికతపై గణనీయమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేవలం ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య లేదా అరెస్టుల సంఖ్యతో మాత్రమే దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను కొలవలేమని ఆయన గుర్తు చేశారు. న్యాయబద్ధమైన, పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన దర్యాప్తులను నిర్వహించి, అవి చివరికి న్యాయపరమైన ఫలితాలకు దారితీసేలా చూడగల సామర్థ్యమే వాటికి అసలైన పరీక్ష అని అన్నారు.
కేంద్రం వాస్తవాలను వెల్లడించాలి
- Advertisement -
- Advertisement -



