జీవిత పద్యము

A poem of lifeజీవితాన్ని ఎప్పుడూ మసిబారనీయొద్దు
కనరు వాసన కొట్టొద్దు
కడిగిన ముత్యమై మెరుస్తుండాలి
నీరందని చెట్టులెక్క వాడిపోవద్దు
గుబురు పూత పూసి మంచి గంధం రాగం తీయాలి
ఏ పేజీలో వెతికి చూసినా
నిండుతనం హుందాతనం చాలాకితనం ఎగరాలి
తీర్థంలో తప్పిన పిల్లాడిలా గాబరా పోవద్దు.
వేసే అడుగుకు ముందే గమ్యం గీతలు రాసుకోవాలి
అందుకోవాల్సిన పండు కోసం ఎత్తుగా పెరగాలి
జిరాఫీ కూడా బతుకు తీరం దాటడానికి
మెడను కొంత పొడవుగా సాపింది
నలుగురు నాలుగు మాటలు
అన్నప్పుడు నీ మనసు పొక్కిలై కన్నీళ్లు కారొచ్చు
వాటిని తలుచుకుంటూ కాలాన్ని మింగేయవద్దు
మనసును దులిపేసుకుని
తళ తళ మెరుస్తూ ముందుకు సాగిపోవాలి
అన్న నోళ్లే నీ వెనువెంట వస్తుంటాయి
నీకంటూ ఒక మైలురాయి ఉండాలి
చెట్లకు పండ్లు తూర్పుకు ఉదయం
కోయిలకు రాగం ఉన్నట్లు.
– గుండెల్లి ఇస్తారి, 9849983874

Spread the love