
– జూన్ 4న ఓట్ల లెక్కింపు
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు
– 12 జిల్లాలలో ఏఆర్వోలుగా అదనపు కలెక్టర్లు
– అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టకోవచ్చు
– ఈనెల 27న పోలింగ్.. జూన్ 5న కౌంటింగ్
– పార్లమెంట్ ఎన్నికల లాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి
– ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ పార్లమెంటు స్థానంలో 74.03 శాతం పోలింగ్ నమోదు అయిందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరో 2 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.7 నియోజకవర్గాల నుండి ఈవీఎంలు జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామని తెలిపారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసామన్నారు. లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుందని తెలిపారు. వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టపద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈనెల 2న నోటిఫికేషన్ విడుదలైందని, ఈనెల 13న నామినేషన్లు వేసిన వారిలో 11 మంది తమనామినేషన్లను ఉపసంహరించుకున్నారని, ఈ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఈ ఉపఎన్నిక నియోజకవర్గ పరిధి 12 జిల్లాలలో ఉందని, 12 మంది అదనపు కలెక్టర్లు ఏ ఆర్ ఓ లు గా ఉన్నారని, పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టుకోవచ్చని, దానికి సంబంధించిన అనుమతులు జిల్లా స్థాయిలో నైతే ఏఆర్వోల వద్ద తీసుకోవాలని, మొత్తం నియోజకవర్గమైతే నల్గొండ లోని ఆర్వో కార్యాలయంలో అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పార్లమెంట్ ఎన్నికల లాగానే ఉంటుందని, అభ్యర్డులు ఏవైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఎంసీఎంసీ వద్ద ప్రి సర్టిఫికేషన్ తీసుకోవాలన్నారు. ఈనెల 27న పోలింగ్ ఉంటుందని, నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ లు ఏర్పాటు చేశామని అక్కడినుండే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల పంపిణీ ఉంటుందని, పోలింగ్ అనంతరం 12 జిల్లాలకు చెందిన బ్యాలెట్ బాక్స్ లు అన్నీ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ కి తరలిస్తామని తెలిపారు. జూన్ 5న నల్గొండ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ మీడియా సమావేశంలో సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.