ప్రజాప్రస్థానం ఆగలేదు

– గొప్పలక్ష్యాలతో ముందుకు సాగాల్సి ఉంది : మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో కోసం సాగుతున్న 25 ఏండ్ల ప్రజాప్రస్థానం ఇక్కడితో ఆగిపోదనీ, గొప్పలక్ష్యాలతో ముందుకు సాగాల్సి ఉందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం గజ్వేల్‌లోని కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో ఆయన్ను ఆర్మూర్‌, హుజురాబాద్‌ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దాకా, కాంగ్రెస్‌ పాలనలో అన్నిరంగాల్లో ఆగమవుతున్న తెలంగాణను గాడిలో పెట్టేదాకా తన ప్రయాణం సాగుతుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గత పథకాలు అందట్లేదని ప్రజలు వాపోతున్నారన్నారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందని విమర్శించారు. కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదనీ, కొత్త నాయకులు తయారవుతారని చెప్పారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని పలుకరిస్తూ వారితో కేసీఆర్‌ ఫొటోలు దిగారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రశాంత్‌ రెడ్డి, కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు జహంగీర్‌, దుండిగల రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love