
– నల్గొండ జిల్లాలో గృహ జ్యోతి లబ్ధిదారులు 1.82 లక్షలు
– మార్చి 11 నుండి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వనున్నాం
– మార్చి 11 నుండి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వనున్నాం
– రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుండి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లులు రావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, గృహజ్యోతి పథకం కింద 200 రూపాయల లోపు బిల్లులు వచ్చిన అర్హులైన పేద వారికి విద్యుత్ బిల్లుల మాఫీ, 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్ వంటివి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.మార్చి 11 నుండి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ఆదివారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క, హైదర్ ఖాన్ గూడా, రహమత్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి గృహజ్యోతి విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడారు. వి. కోటమ్మ, షబానా, జహంగీర్ తదితర లబ్ధిదారులతో మంత్రి నేరుగా మాట్లాడుతూ గతంలో ఎంత విద్యుత్ బిల్లు వచ్చేదని? ఈసారి ఎంత వచ్చిందని ? అడుగగా గతంలో రూ. 738, రూ.1000 రూ.268 ఇలా బిల్లులు వచ్చేవని, ఇప్పుడు జీరో బిల్లు వచ్చిందని వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గృహజ్యోతి పథకం కింద నల్గొండ జిల్లాలో లక్ష 82 వేల మంది లబ్ది పొందుతున్నారని తెలిపారు. 200 రూపాయల లోపు విద్యుత్ బిల్లులు వచ్చే అర్హులైన,గృహ జ్యోతికి దరఖాస్తు చేసుకున్న వారందరూ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది అన్నారు. 10 రోజుల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని, ముఖ్యంగా సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని చూపించి ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలో మామిళ్ళ గూడెంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 3 నెలల్లో మాన్యం చెల్కలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నామని, 500 రూపాయలకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని వెల్లడించారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని మంత్రి అన్నారు. అనంతరం నల్గొండలోని ఆర్య సమాజ్ ఆవరణలో నల్గొండ జిల్లా ఆర్య సమాజ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఆర్డీవో రవి ,ట్రాన్స్ కో ఎస్ఈ చంద్రమోహన్, డిఈ వెంకటేశ్వర్లు, ఏడి సత్యనారాయణ,ఏఈ రమ్య, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.