రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలి

– మార్కెట్ కు 60 వేల బస్తాల ధాన్యం రాక
నవతెలంగాణ – తిరుమలగిరి
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. శనివారం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లోకి అత్యధికంగా ధాన్యం వచ్చిన నేపథ్యంలో ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ గుర్తింపు పొందిన మార్కెట్ అని, గత రెండు రోజులు మార్కెట్ కు సెలవు ఇవ్వడంతో శనివారం ఒక్కసారిగా 60 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందని అన్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున ధాన్యం రావడంతో మార్కెట్ కు స్థలం సరిపోడం లేదన్నారు. గత ప్రభుత్వంలో మార్కెట్ ఆవరణంలో అనవసరంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని దాదాపు 20,000 బస్తాలు పట్టే స్థలాన్ని నిర్మాణంతో ఆగం చేశారన్నారు. దానిని తప్పకుండా తొలగింపచేసి మునుపటిల ఉండేవిధంగా చేయిస్తానన్నారు. అదేవిధంగా మార్కెట్ కు ఎక్కువ ధాన్యం వచ్చిందని తక్కువ రేట్లకు దాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శికి సూచిస్తూ రోజుకు 25 వేల బస్తాల వరకే టోకెన్లు ఇవ్వాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని కోరారు. రైతులపై దందాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు కమిషన్లు పెట్టి రైతులను ముంచితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. రైతులు కష్టం చేసి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని మొత్తాన్ని మార్కెట్ కు తీసుకురావడం జరిగిందని, కావున రైతులకు అన్యాయం చేయవద్దని కనీసం 2000 రూపాయల మద్దతు ధర అందించాలన్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే మార్కెట్ గేటు తీయించాలని మార్కెట్ కార్యదర్శి కి వివరించారు. ఎందుకంటే ఈరోజు దాదాపు ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు వందలాది ట్రాక్టర్లు రావడంతో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందన్నారు. అదేవిధంగా ఎండలు తీవ్రంగా ఉన్నందున మార్కెట్ కు వచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు మరియు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కార్యదర్శి శ్రీధర్ కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్, జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, జిల్లా అధికార ప్రతినిధి కొండల్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జి కందుకూరి లక్ష్మయ్య, నాయకులు జిమ్మిలాల్, తిరుమని యాదగిరి, హీరూ నాయక్, కందుకూరి రోశయ్య, మరియు మార్కెట్ వ్యాపారస్తులు, కమిషన్ దారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love