నైమిష అనే అడవిలో హిరణ్యం అనే ఒక కుందేలు ఉండేది. అది అడవిలో ఉన్న మిగితా జంతువులకి అవసరానికి సహాయం చేస్తూ ప్రశంసలు పొందుతూ ఉండేది.
అదే అడవిలో ఉన్న మందకం అనే నక్కకి అన్ని జంతువులు కుందేలును ప్రశంసిస్తూ ఉంటే అక్కసుగా ఉండేది. ఎలాగైనా కుందేలుకు ఆపద తలపెట్టలని భావిస్తుంది నక్క.
ఒకనాడు అడవికి రాజైన సింహం కిరీటాన్ని నక్క దొంగిలించి దాచిపెడుతుంది. తలపై కిరీటం లేని సింహం ఎంతో అవమాన భారంతో కుమిలిపోతూ తన గుహ నుండి కూడా బయటకు రాకుండా లోపలే వుంటుంది.
సింహం కిరీటాన్ని దొంగిలించిన నక్క ఆ కుందేలు దగ్గరికి వెళ్లి ”కుందేలు మామా… మన మహారాజుగారు కొన్ని రోజులు దీక్షలో ఉండి కిరీటాన్ని ధరించరట. ఆయనకి ఈ అడవిలో అత్యంత నమ్మకమైన వ్యక్తివి నువ్వే అని, దీన్ని నీ దగ్గర భద్రంగా దాచిపెట్టమని చెప్పారు. కిరీటాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కుందేలుకు ఆ కిరీటాన్ని ఇస్తుంది.
కుందేలును చంపాలని ఆశతో ఉన్న నక్క రాజైన సింహం దగ్గరకి వెళ్లి ”మహారాజా మీ తలపై కిరీటం ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు కిరీటం లేని మిమ్మల్ని చూడటం చాలా బాధగా ఉంది. మీరు తినగా మిగిలిన మాంసం తిన్న కతజ్ఞతతో మీకు కిరీటం ఆచూకీ చెప్పి సహాయం చేయాలనుకుంటున్నాను. ఒక కుందేలు మీ కిరీటాన్ని పెట్టుకుని అడవంతా తిరుగుతుండగా చూసాను. అది నీటి గుంట దగ్గరి పొదల్లో ఉంది” అని కపట బుద్ధి కలిగిన నక్క సింహంతో చెపుతుంది.
కోపంతో ఉన్న సింహం కుందేలును చంపాలని పొదల వైపు వెళ్తుంది.
గర్జిస్తూ తన వైపు వస్తున్న సింహాన్ని గమనించిన కుందేలు తనకేదో అపాయం రాబోతున్నదని గమనించింది. జిత్తుల మారి నక్క తనమీద ఏదో సింహానికి చెప్పిందని ఊహించి, ఆపదలో ఉన్నప్పుడు సమయస్ఫూర్తి ప్రదర్శించాలని తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని, సింహం కిరీటాన్ని చేతుల్లో పట్టుకుని ”మహారాజా మీ కిరీటాన్ని దొంగిలించింది వాస్తవమే కానీ దానికి కారణం అడవికి రాజైన మీకు ప్రాణ గండం ఉంది. అది తొలగి పోవడం కోసం ఈ కిరీటాన్ని దేవుడు దగ్గర పెట్టి పూజిస్తున్నాను. మీ ప్రాణాలు కాపాడాలని చేశాను తప్ప ఏ ఉద్దేశం లేదు. కానీ ఈ కిరీటంలో ఉన్న వజ్రం మాత్రం ఒకనాడు విందు కోసం వచ్చిన నక్క మామ మింగేసింది అని చెప్పింది. దాంతో సింహం కుందేలును క్షమించి తన కిరీటంలో ఉన్న వజ్రం కోసం ఒక్క ఉదుటున నక్కపై దూకుతుంది .
కుందేలుకు హాని చేపట్టాలని చూసి తను ఆపదలో పడ్డానని బావించుకుని నక్క బతుకుజీవుడా అని పరుగులంకించింది.
– శారద అభిలాష్ (ఎండపల్లి)