విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ రూరల్‌
మండలంలోని బంగారుగూడలోని ప్రాథమిక పాఠశాల ఉర్ధూ మీడియం, రామాయి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ రాజర్షిషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొదటగా ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడేలో భాగంగా బంగారుగూడ కాలనీలో పర్యటించి, కాలనీ సమస్యలపై ఆరాతీశారు. ఇంటింటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. వర్షాకాలం సందర్భంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చుట్టు ప్రక్కల, రోడ్ల పైన, ఇండ్లల్లో ఉండే కూలర్లు, రంజన్‌లు, కొబ్బరి బోండాలు, తదితర వాటిలో నీరు నిలువ లేకుండా పరిశుభ్రత పాటించాలని పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఈ సీజన్‌లో దోమలు, ఈగలు వాలకుండా శుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కాలనీలో ఉన్న సమస్యలను విని సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం బంగారుగూడ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్ధుల అభ్యాసనా సామర్థ్యాలను పరిశిలించి, విద్యార్ధులతో పాఠాలు చదివించి, బోర్డ్‌ పై రాయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు యూసఫ్‌ ఖాన్‌ను ఉర్దూతో పాటు ఇంగ్లీష్‌ కూడా నేర్పించాలని, విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించి, వారి నైపుణ్యాన్ని వెలికి తీయాలని అన్నారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో బాధ్యతగా వ్యవహరించాలని, బోధన సరిగా లేదని, చదవడం రాయడంలో శ్రద్ద వహించాలని తెలిపారు. రామాయి మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి, మధ్యాహ్నం భోజనం ను పరిశీలించి, నాణ్యతతో కూడిన ఆహారం అందించాలనీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా వినియోగించాలని, కిచెన్‌ షెడ్‌ ఏర్పాటు చేయాలని పరిసరాలు బాగుండి, సరైన విద్యా బోధనా ఉంటేనే పిల్లలు బాగా చదువుతారని అన్నారు. ప్రాథమిక పాఠశాల నుండి పిల్లలకు వారి భాషతో పాటు ఇంగ్లీష్‌లో రాయడం, చదవడం నేర్పించాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనలో భాగంగా పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు. తరగతి గదులు, టాయిలెట్స్‌, రన్నింగ్‌ వాటర్‌ పరిశీలించి, స్కూల్‌ బిల్డింగ్‌ పైబాగంలో నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలని, తరగతి గదుల్లో వర్షం నీరు పడకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ ఖమ్మర్‌ అహ్మద్‌, ఎంఈఓ, తహసీల్దార్‌, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధితశాఖ అధికారులు పాల్గొన్నారు.

Spread the love