Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌గొర్రెల పంపిణీ పథకాన్నిపున:ప్రారంభించాలి

‌గొర్రెల పంపిణీ పథకాన్నిపున:ప్రారంభించాలి

- Advertisement -


మాజీమంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌
బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేతకు కురుమ సంఘం నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకాన్ని పున:ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నాయకులు శనివారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని కురుమలు, యాదవులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కురుమల సభలు, సమావేశాలు, పేద విద్యార్థుల వసతిగృహం కోసం కోకాపేట్‌లో ఐదెకరాల భూమిని కేటాయించిందని గుర్తు చేశారు. రూ.ఏడు కోట్ల వ్యయంతో దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి కురుమ సంఘానికి అందించిందని చెప్పారు.
అలాంటి భవనాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయివేటుపరం చేసే ప్రయత్నాలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆ భవనాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కురుమల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కొత్త యూనిట్ల పంపిణీని నిలిపేసి వేలాది కురుమ కుటుంబాల ఆశలను అడ్డుకుందని చెప్పారు. ఎన్నికల సమయంలో కురుమలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కురుమల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కురుమ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం-వసతిగృహాన్ని ప్రయివేటుపరం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. కురుమ, యాదవ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. నిలిచిపోయిన గొర్రెల పంపిణీ పథకాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. కురుమల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యనైనా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందనీ, వారికి అండగా నిలుస్తుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -