పాట జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఉద్యమాలకు ఊతమిస్తుంది. చైతన్యపరుస్తుంది. సామాజిక గీతాలకు ఉన్న ఆదరణ కవిత్వానికి కూడా ఉండదు. పాట సులువుగా నోళ్ళల్లో నానుతుంటుంది. కవిత్వం సామాన్యుడు సులువుగా పట్టుకోలేడు. పాట ప్రాశస్త్యాన్ని కవిత్వంగా మార్చిన గోపగాని రవీందర్ కవిత ఎన్ని పార్శ్వలను పరిచయం చేస్తుందో తెలుసుకుందాం. కవి ‘నేనొక పాటను’ అని రాసిన ఈ కవితలో తనను పరవశమొందించిన ‘పాట’ జీవాన్ని పట్టుకుందాం.
పాట పసిపిల్లాడిగా ఉన్నప్పుడే మనిషి జీవితంలోకి ప్రవేశిస్తుంది. జోలపాటలా మారి నిద్రపుచ్చుతుంది. పాట పాడకపోతే నిద్రపోని శిశువులు ఉన్నారు. పాటలో మత్తు ఉంది. మహత్తు ఉంది. అలాంటి పాటలా మారిపోయాడీ కవి. ఎత్తుగడలో ఈ విషయాన్ని పట్టుకొచ్చి ఓ క్రమ పద్ధతిగా కవితను నిర్మించాడు. పాటలా మారిపోయి కవి మానవీయతను, ప్రకతిని తనలోకి తీసుకొని మంచిదారిని నిర్మాణం చేస్తున్నాడు. ఎవరైనా ఒకరు ఆ దారి గుండా నడవక పోతారా అనే ఆశ కవి వాక్యాల్లో కనిపిస్తుంది.
పాటకు, పచ్చని చెట్టుకు ఏం సంబంధం ఉంది అనే ప్రశ్న వేసుకుంటే అడవికి, మనిషికి ఉన్న సంబంధం ఉంది. ఈ సందర్భానికి జయరాజు రాసిన పాట ”పచ్చని చెట్టును నేను రా, పాలు గారే మనసు నాదిరా” గుర్తొస్తుంది. కవికి, చెట్టుకు, పాటకు విడదీయరాని అనుబంధం ఉంది. సూర్యకాంతికి, చెట్టుకు మధ్య ఉండే సంబంధం అదే. ఈ కవితా పాటలో కవి ప్రకతిలోని పచ్చదనానికి కారణమైన వెలుగు కిరణాలను స్మరిస్తున్నాడు. పాటైనా, కవితయినా వెలుగును ప్రసాదించేదే కదా! అందుకోసమే రవీందర్ ‘నేనొక పాట’ను అంటూ తపిస్తున్నాడు.
కవి సమాజంలోని మనుషుల మధ్య సంబంధాలను కోరుకుంటున్నాడు. మాటలతో సమాజాన్ని పునర్నిర్మాణం చేయాలన్న కాంక్షను కలిగినవాడు. ఆత్మీయతతో అందరూ ఒక దగ్గర కూడాలని ఈ కవిత వాక్యాల ద్వారా సందేశం పంపుతున్నాడు. ప్రకతిలో భాగమైన పంట పొలాల అవసరం గూర్చి చెబుతూ అందరినీ సమానంగా చూస్తూ అందరి ఆకలి తీర్చే పొలాల వంటి పాటను నేను అని రైతు పక్షాన గొంతు విప్పి మాట్లాడుతున్నాడు. ఈ పాట తన ఒక్కడి పాట కాదు. మనందరి పాట. ప్రకతి పాట. మానవీయ స్పర్శ ఉన్న పాట.
ఈ కవితా పాటలో కవి ప్రకతిని గూర్చి పలవరిస్తూ రాసినా, మానవీయత అవసరాన్ని ఎలుగెత్తి చాటినా మనిషి కోసమే రాశాడు. మనిషిలో పచ్చదనాన్ని అద్దటం కోసమే తాపత్రయపడ్డాడు. ‘నేనొక పాట’ను అంటూ బయలుదేరి మనల్ని కూడా పాటలుగా మలిచే దారిలోకి చకచగా అడుగులు వేస్తున్నాడు. ఈ పాటలోకి వెళ్లి ఆ దారిని గమనించండి. ఆ తదుపరి ఎవరి దారి వాళ్ళు చూసుకోండి.
‘నేనొక పాటను’
కాలం వంతెన మీద
పసిపిల్లాడిని నిద్రపుచ్చడానికి
తల్లి పాడే జోలపాట లాంటి పాటను..!
అడవిలోని పచ్చని చెట్లకు
ఊపిరిపోసే
వెలుగు కిరణాల లాంటి పాటను..!
మాటకు మాటకు మధ్యన
మొలకెత్తుతున్న ఆత్మీయతలకు
ఆయువు పట్టులాంటి పాటను..
దారి పొడుగున పలకరిస్తున్న
అన్నార్తుల ఆకలిని తీర్చే
తల వంచని పొలాల వంటి పాటను..!
అలుపులేని జీవన సమరంలో
సగటు మనిషిని అక్కున చేర్చుకునే
మానవీయమైన స్పర్శలాంటి పాటను..!
చూడముచ్చటైన దశ్యాలతో
చుట్టూ అలరారుతున్న రమణీయతతో
ఆలపిస్తున్న ప్రకతి లాంటి పాటను..
– గోపగాని రవీందర్
– డా|| తండ హరీష్ గౌడ్
8978439551