Friday, July 31, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర హోం మంత్రి సభకు రావాలి

కేంద్ర హోం మంత్రి సభకు రావాలి

- Advertisement -

విద్యార్థులపై దాడికి ఎవరు ఆదేశాలిచ్చారు?
రామ మందిర దోపిడీపై కేంద్రం వివరణ ఇవ్వాలి
యూపీ ప్రభుత్వ విచారణ ఒక బూటకం
పార్లమెంట్‌‌ ఆవరణలో ప్రతిపక్షాల వినూత్న ఆందోళన
నినాదాలతో హోరెత్తించిన ఎంపీలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
విద్యార్థులపై పోలీసుల చర్య, అయోధ్యలోని రామ మందిరంలో చందాచోరీకి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. గురువారం ఉభయ సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రామ మందిరంలో విరాళాల దొంగతనాన్ని తెలిపేలా… హుండీలో ఎంపీలు డబ్బులు వేస్తూ నిరసన తెలిపారు. ‘అధికార దొంగలు’, ‘చందాల దొంగలు’, ‘కేంద్ర హోం మంత్రి సభకు రావాలి’, విద్యార్థులకు దాడికి ఆదేశాలు ఎవరిచ్చారు’ అని నినాదాలతో హోరెత్తించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అణచివేతకు ఆదేశించినందుకు హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు లోపల, వెలుపల తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు విద్యార్థులను, యువతను కొట్టడానికి అనుమతిస్తూ అమిత్ షా నేరపూరిత మౌనం పాటిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఉభయ సభలలోనూ తీవ్రంగా నిరసన తెలిపాయి. తీవ్ర నిరసనల కారణంగా లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేసినప్పుడు, రాజ్యసభలో ప్రభుత్వ పరీక్షలలో అవకతవకలను నిరోధించే బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు అమిత్ షాపై కూడా విరుచుకుపడ్డాయి. తీవ్ర నిరసనల కారణంగా ఉభయ సభల కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం కలిగింది.

‘శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, ఏకే 47 ఎక్కు పెట్టాలని ఆదేశాలు ఎవరిచ్చారు? విద్యార్థుల వేటకు ఎవరు ఆదేశించారు?’ అని రాసి ఉన్న భారీ బ్యానర్లను ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు గేటు వద్ద కూడా తమ నిరసనను కొనసాగించాయి. ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశాలతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని అధికార పార్టీ ఆరోపించింది. ప్రభుత్వం ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధంగా ఉందని, కానీ ప్రతిపక్షాలు చర్చకు సిద్ధంగా లేవని కేంద్ర మంత్రి జెపి నడ్డా ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద యువకులను వేటాడటంపై ఉభయ సభలలో ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నప్పటికీ, ప్రధానమంత్రి, హోం మంత్రి పార్లమెంటుకు కనపడకుండా దాక్కుంటున్నారు. ఏసీ గదుల్లో పిల్లలను కొట్టమని ఆదేశించిన తర్వాత హోం మంత్రి బాధ్యత తీసుకోకుండా పారిపోతున్నారని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ‘మిమ్మల్ని ఏసీ గది నుంచి బయటకు లాక్కెళ్తారు’ అన్న ఖర్గే వ్యాఖ్యను అధికార పార్టీ వ్యతిరేకించింది.

కేంద్ర ప్రభుత్వంపై దేశంలోని విద్యార్థులు, యువతలో ఉన్న తీవ్ర ఆగ్రహాన్ని తన వ్యాఖ్య ప్రతిబింబిస్తోందని ఖర్గే వివరించినప్పటికీ.. ఆ వ్యాఖ్యపై ఎన్డీఏ సభ్యులు గందరగోళం సృష్టించారు. మొన్నటి రోజున లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా అధికార పార్టీ పెద్ద గందరగోళం సృష్టించింది. ఇదిలా ఉండగా, వందేమాతరంను అవమానించడాన్ని నేరంగా పరిగణించే సవరణ బిల్లును లోక్‌సభ కూడా మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును మొన్న రాజ్యసభ కూడా ఆమోదించింది. వందేమాతరంను అవమానించినందుకు మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. జంతర్ మంతర్ వద్ద పోలీసుల అరాచకాలపై విచారణ జరిపేందుకు స్వతంత్ర న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై చర్చ జరపాలని, సభా కార్యకలాపాలను వాయిదా వేయాలని కోరుతూ సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ నోటీసు ఇచ్చారు. విద్యార్థులపై పోలీసుల అరాచకాలు, ఏకేజీ భవన్‌లో ఢిల్లీ పోలీసులు జరిపిన అరాచకాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఎంపీ వి. శివదాసన్ కూడా రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు.

‘రామ మందిర దోపిడీ’
అయోధ్యలోని రామ మందిర దోపిడీపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ముందుకొచ్చాయి. ‘విరాళాలకు సమాధానం చెప్పాలి’ అంటూ పార్లమెంట్ గేటు వద్ద బ్యానర్ ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ‘అయోధ్యలో దోపిడీపై యూపీ ప్రభుత్వ విచారణ కేవలం ఒక బూటకం’ అని డింపుల్ యాదవ్ స్పందించారు. లూటీపై సమాధానం చెప్పాలని కోరుతూ ఉభయ సభల సభ్యులు నినాదాలు చేశారు. రాబోయే రోజుల్లో ఈ లూటీకి వ్యతిరేకంగా పార్లమెంటులో నిరసనను తీవ్రతరం చేయాలని ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం నిర్ణయించింది. ఈ నిరసనలో ప్రియాంక గాంధీ, ఎస్పీ ధర్మేంద్ర యాదవ్, సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, ఎఎ రహీం, టీఎంసీకి చెందిన సాగరిక ఘోష్, జేఎంఎం మహువా, ఇతర ఎంపీలు కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -