యుద్ధం షురూ…

War begins...మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ప్రశ్నలు ఈ విధంగా ఉండేవి, ”యుద్ధములు ఎన్ని రకములు? అవి ఏవి? వివరించుము”. ఇప్పటిలాగా స్కెచ్‌ పెన్నులు, మార్కర్లు లేవప్పుడు. ఎర్రపెన్ను వాడరాదు. అందుకే గుండ్రంగా అక్షరాలు ఉండి అక్కడక్కడా అండర్‌లైన్లు చేసే వాళ్ళు. అక్షరాలు గజిబిజిగా ఉన్నోళ్ళకు కొన్ని ఉపయోగాలు కూడా ఉండేవి. ఏదో కొన్ని పేజీలు బర బరా గీకేస్తే బహుశా విషయం రాసి ఉంటాడులే అని మార్కులు వచ్చే అవకాశమూ ఉండేది. ఒక్కోసారి వాళ్ళకే మార్కులు ఎక్కువగా వచ్చేవి కూడా. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రత్యేకతను ఉపయోగించుకొని ముందుకుపోతూ ఉంటే ఏదో ఒకనాటికి అందరూ గుర్తిస్తారు.
యుద్ధములలో అంతర్యుద్ధములు, స్వాతంత్య్ర యుద్ధములు, తిరుగుబాటు యుద్ధములు, రెండు దేశాల మధ్య యుద్ధములు, ప్రపంచ యుద్ధములు మొదలైన రకాలు ఉంటాయి అని రాయొచ్చు లేదా ఒకటి, రెండు సంఖ్యలేసీ రాయొచ్చు. అది పేజీలు నింపే వాళ్ళకు బాగా కలిసి వచ్చే అంశం కూడా. ఇప్పుడంటే బుల్లెట్లు వచ్చాయి కానీ అవి అన్నిచోట్లా వాడలేము కదా. ఇకపోతే ఎక్కడికక్కడ ఇలాంటి టెక్నిక్కులు వాడేవాళ్ళే ఎప్పుడూ లాభం పొందుతూ ఉంటారు.
ఇక యుద్ధం వద్దు శాంతి ముద్దు అని అందరూ చెబుతారు. యుద్ధం ఆగిపోయినాక ఓడిపోయినవాడికంటే గెలిచినవాడే ఎక్కువ ఏడుస్తాడు. ఇద్దరికీ జరిగిన నష్టం ఎక్కువగానే ఉంటుంది. ఓడి పోయానని ఒకడేడిస్తే ఎందుకు గెలిచానో అర్థం కాక ఒకడేడుస్తాడు. సినిమా ఫ్లాపవుతే నిర్మాత పరిస్థితి ఏవిధంగా ఉంటుందో యుద్ధంలో ఓడిపోయిన వాడికీ అలాగే ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు నాశనం, మునక, చివరికోరిక అన్నరీతిలో ఉంటుంది. వీపున రాయికట్టుకొని దూకినోళ్ళయితే రాయి నీది మునక నాది అని కూడా పెట్టుకోవచ్చు.
ఎవరికైనా యుద్ధమనగానే యుద్ధతంత్రం గుర్తొస్తుంది. తంత్రమంటే అదేదో మంత్రం కాదు. ఎలా పోరాడాలి, ఎవరిని ముందు పంపాలి, ఎవరిని వెనక పంపాలి, ఎవరిని అసలు పంపకూడదు అన్నవి ఓ పద్ధతి ప్రకారం చేసే ప్రణాళిక, టెక్నిక్కు. ఆ వైపు నుండి ఎవరిని పంపితే తమ వైపునుండి ఎవరిని పంపాలి అన్నది కూడా అందులోకే వస్తుంది. అవతలివాళ్ళు అకస్మాత్తుగా తమ ప్లాను మారిస్తే వెంటనే తామూ మార్చాల్సి వస్తుంది. అసలు చదరంగం ఆట ఈ యుద్ధ తంత్రం మీదే ఆధారపడి ఉందని మనందరికీ తెలుసు.
మత్తు పదార్థాలను వాడటం యుద్ధంలో ఒక కళ. కర్ణుడికి రధసారధిగా వస్తున్న శల్యుడనే రాజుకు ముందురోజు బాగా మందుపోయించారు పాండవులు. అతణ్ణి మంచి చేసుకొని కర్ణుడి మనసు విరిగేలా మాట్లాడించి, ఆ అర్జునిడి ముందు నువ్వు దేనికీ పనికి రావన్న పనికి మాలిన మాటలు మాట్లాడి తాను తాగిన మందుకు ఫలితాన్ని చూపిస్తాడు. ఇలా తాగుడుకు బానిసలైన వారిని తమ పనులకు వాడుకోవడం ఒక కళ. అసలు మందు చరిత్ర ఇంద పెద్దదీ, సుదీరమై నదీనా అనిపిస్తుంది. పోసే వాడుండాలి గాని పోయించుకునే వాళ్ళకు కొదువ లేదు. మంచి చెబితే వినేవాళ్ళకు కరువుం టుంది. ఆరోగ్యం కోసం మందులు వాడమంటే వాడనివాళ్ళు చాలామంది దొరకొచ్చు. ఏదైనా చేయొద్దు అంటే, అదే పనిగా వద్దన్న పని చేసేవాళ్ళను కూడా చూడొచ్చు. మందు పోస్తుంటే వద్దనేవాళ్ళు అరుదు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగాని శాశ్వత శత్రువులు కాని ఉండరనేది ఒక మూలసూత్రం. రాజకీయ విశ్లేషకులు చెప్పిన ఈ మాట వందకు వందశాతం నిజం. నీ అంతు చూస్త బిడ్డా అన్నోడే కొన్ని రోజుల తరువాత నీ బాంచెన్‌ దొరా అనవచ్చు. అదంతా ”ఇచ్చి పుచ్చుకునే” దానిపై ఆధారపడి ఉంటుంది. ముగిసిన రాజకీయాలే చరిత్ర, నడుస్తున్న చరిత్రే రాజకీయాలు అని అరిస్టాటిల్‌ మహాశయుడు ఏనాడో చెప్పిండు. అందుకే చరిత్ర చూసినా, లేదా రాజకీయాలు చూసినా ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణి బాగా కనిపిస్తుంది. అసలు ప్రజల కమి ఇస్తున్నామనే విషయం పక్కనబెట్టి ప్రజలసొమ్ము ఏవిధంగా పంచుకుంటున్నా మన్నదే అజెండా ఐతే కష్టం, నష్టం. ఈత నేర్చుకోవడానికి నీళ్ళలో దూకేటప్పుడు వీపున మునగబెండు కట్టుకున్నావా లేక గాలి నింపిన ట్యూబు కట్టుకున్నావా లేక తెలిసితెలిసీ రాయి కట్టుకున్నావా అని చూసుకోవాలి.
కట్‌ చేసి పూర్తిగా ప్రస్తుతానికి వస్తే నడుస్తున్న రాజకీయాలను, మిత్ర శత్రువులను, శతృత్వ మిత్రు లను, గంతులు వేసే రాజకీయ కప్పలను, మందు పోసేవాళ్ళను, పోయించుకునే వాళ్ళను, అలా పోయించుకుని తమను తామే మోస గించుకునే వాళ్ళను ఇలా అందరినీ చూడవచ్చు. మాటల యుద్ధం మొద లైందన్న దానికి గుర్తుగా హిందీలో, తెలుగులో, ఇంగ్లుషులో ఎన్ని రకాల తిట్లు, ఎన్ని రకాల పిట్టకథలు ఉంటా యో అన్నీ వినవచ్చు. ఇంగ్లీషు, హిందీ తిట్లకు, అలాగే పిట్టకథలకు తెలుగు అనువాదాలు సైతం ఉంటాయి.
విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వాహనాలు యుద్ధాల్లో మాదిరే ఈ ఎన్ని కల్లో కూడా వాడతారు. పైనుండి వేసే బాంబులుండవుగాని దిగాక మీటిం గుల్లో రాజకీయ అస్త్రాలు వేస్తారు. ప్రజల సొమ్మును పంచుకోవడానికా మీ మధ్య యుద్ధం? ప్రజల ఓట్లను పంచుకోవడానికా? అసలు ఒక్కో చోట ఒక రకమైన యుద్ధమా మీది? ప్రజలు మా వాళ్ళు అని చెప్పుకుంటూనే వాళ్ళను చీల్చుకుంటూ నీ బాగుకోసం నీ రాజకీయ రోడ్లు వేసుకుంటున్నావా? నిఖా ర్సుగా ప్రజలవైపు నిలబడి, ప్రజలకోసం యుద్ధాన్ని తలపించే పోరాటాలు చేసి నోళ్ళ గురించి అదే ప్రజలు తెలుసుకోకుండా చరిత్రను మార్చడమే నీ యుద్ధ మా? ఇంతకీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో గ్రహించే, ఆగ్రహించే ప్రజాయుద్ధం మొదలవుతుందా అన్నదే అందరి ఆశ. ప్రజల కోపం యుద్ధం షురూ చేయాలిప్పుడు.
జంధ్యాల రఘుబాబు
9849753298

Spread the love