మేనిఫెస్టోలో ఇచ్చిన యాదవ కార్పొరేషన్ హామీని ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ – ఉప్పునుంతల
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చింది ఇచ్చిన హామీని త్వరలోనే అమలు చేయాలని లేదంటే జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని యాదవ హక్కుల పోరాట సమితి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కుందేళ్ళ శంకర్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు దిశగా ఊసే లేదని వెంటనే ఇచ్చిన హామీని అమలు చేయాలని అదేవిధంగా వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పదివేల కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం యాదవులకు గొర్రెల పంపిణీ స్కీంను ఏర్పాటు చేసి మొదటి విడతలో సగం సగం పంపిణీ చేసి రెండవ విడత పంపిణీ విషయంలో చేతులెత్తేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాస్త స్కీమును కూడా ఎత్తేయడం జరిగింది కాబట్టి యాదవులు ఆర్థికంగా ఎదగాలంటే గొర్రెల స్కీమును మళ్లీ ఏర్పాటు చేసి యూనిట్ ధర ప్రకారం నగదు బదిలీ పథకాన్ని అమలుపరచి లబ్ధిదారుని అకౌంట్లో డబ్బులు వేసే విధంగా ఆలోచించాలన్నారు. ఈ విధానం వల్ల రీసైక్లింగ్, దళారీ వ్యవస్థను అరికట్టవచ్చని ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ స్కీం వల్ల లబ్ధిదారులు చాలావరకు దళారి వ్యవస్థ వల్ల మోసపోయారని ఆయన గుర్తు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన యాదవులకు నామినేటెడ్ పదవులను కేటాయించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
Spread the love