– ప్రజల జేబులు కొల్లగొడుతున్నారు : కేంద్రంపై రాహుల్ మండిపాటు
కార్బా (ఛత్తీస్‌గఢ్) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవని, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. భారత్ జోడో న్యారు యాత్రలో భాగంగా ఆయన సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని కార్బాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించి వారి జేబులు కొల్లగొడుతోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ కుటిల యత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు 74% మేర ఉన్నారని అంటూ భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న 200 కంపెనీల్లో ఏ ఒక్కటీ వారి యాజమాన్యం కింద లేదని రాహుల్ గుర్తు చేశారు. కానీ దేశంలోని సొమ్మునంతటినీ ఆ కంపెనీలకే ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని హిందూ రాష్ట్రమని బీజేపీ పిలుస్తోందని, అయితే జనాభాలో 74% మందికి మాత్రం ఏమీ దక్కడం లేదని చెప్పారు. వారు కేవలం స్టీలు ప్లేట్లు కడగడానికి, గంట కొట్టడానికి, మొబైల్ ఫోన్లు చూపించడానికి, ఆకలితో అలమటించి చనిపోవడానికి మాత్రమే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కేంద్రమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నాకు చెప్పండి. గత నెలలో జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో మీరు పేదలు, కార్మికులు, నిరుద్యోగులు లేదా చిన్న చిన్న వ్యాపారులను చూశారా? నేను అదానీ, అంబానీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారారు, బడా వ్యాపారవేత్తలను మాత్రమే చూశాను. అదానీ, అంబానీ, వారి కుటుంబాలు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఉపాధి లేక ద్రవ్యోల్బణంలో విలవిలలాడుతుంటే అదానీ, అంబానీ చైనా వస్తువులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. దీనిని ‘ఆర్థిక అన్యాయం’గా రాహుల్ అభివర్ణించారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లో జోడో యాత్రను కుదించాలని రాహుల్ నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆయన పశ్చిమ ప్రాంతంలో పర్యటించడం లేదు. 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించి, 26వ తేదీ వరకూ కొనసాగాల్సి ఉంది. ఆ తర్వాత యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశిస్తుంది. అయితే తాజా నిర్ణయంతో ఐదు రోజుల ముందుగానే అంటే 21వ తేదీతో రాహుల్ యూపీలో తన యాత్రను ముగించుకొని మధ్యప్రదేశ్‌లో అడుగు పెడతారు.