40 వేల మంది
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి
ఆర్టీసీ విలీనం హామీని నిలబెట్టుకోవాలి
తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును పూర్తిచేయాలి
అసెంబ్లీ సమావేశాలను పదిరోజులు నిర్వహించాలి :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి గుండె కాయలాంటి సింగరేణిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిసి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ యూనియన్ పోరాటాల ఫలితంగానే సింగరేణి సంస్థకు మణుగూరు డీప్ బ్లాక్ దక్కిందని తెలిపారు. ఆ బ్లాక్‌ను జెన్‌కోకు కట్టబెట్టి ఆ తర్వాత ప్రయివేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఆ బ్లాక్ సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదే తరహాలో సింగరేణిలోని అన్ని బొగ్గు గనులను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలనీ, అలాగైతే మరో లక్ష మందికిపైగా అదనంగా ఉద్యోగాలు కల్పించవచ్చునని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నష్టాల పేరు చెప్పి సింగరేణిని ప్రయివేటు పరం చేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల ద్వారా సింగరేణికి రూ. 56 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు. సింగరేణిలో సుమారు 40 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారనీ, వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మైనింగ్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ చట్టం కారణంగా బొగ్గు బ్లాకులు వేలానికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఇది సింగరేణికి మరణ శాసనంగా మారిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం ప్రక్రియ నుంచి తప్పించేలా కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక ఒప్పందం సాధించాలని విజప్తి చేశారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను బయట పడేసేందుకు చిన్నారెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిపుణుల కమిటీ నివేదిక తెచ్చిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని విన్నవించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బాకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగాల కార్మికులు ఉన్నారనీ, వారందరికీ న్యాయం జరిగేలా కనీస వేతనాలను సవరించాలని కోరారు. వారందరికీ న్యాయం చేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నెల 6 నుంచి ప్రచార యాత్రలు
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తమ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల ఆరో తేదీ నుంచి 14 వరకు దేశవ్యాప్త పాద, ప్రచార యాత్రలు నిర్వహించనున్నామని చెప్పారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారీ నిరసన ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్11 నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నెల 22న సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సభ ఉంటుందని తెలిపారు. బీహర్‌లోని బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ విజయం సాధిం చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జెన్‌జీ పోరాట విజయం దేశంలో గొప్ప మార్పునకు సంకేత మన్నారు. హిందూత్వ, రామునిపేరుతో బీజేపీ రాజకీయాలు ఎల్లకాలం చెల్లవనీ, దేశ యువత అంతా గమనిస్తోందని తెలిపారు.
సింగరేణి రక్షణకు సమగ్ర ప్రణాళికలుండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



